ఆఫ్‌లైన్‌లో టికెట్లు లేనట్టేనా?
● 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో డీసీ ఢీ ● ఆన్‌లైన్‌లోనే టికెట్ల విక్రయాలు
విశాఖ స్పోర్ట్స్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడనున్న తొలి ఐపీఎల్ మ్యాచ్‌కు ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయం లేనట్టేనా? ఇటీవల ఏసీఏ నిర్వహించిన సమావేశంలో ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు విక్రయిస్తామని ప్రకటించినప్పటికీ, అందుకు తగ్గట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) బృందం ఏర్పాట్లు చేయకపోవడంతో కౌంటర్ల ద్వారా టికెట్ల విక్రయం లేదని తెలిసింది. ఈ నెల 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో డీసీ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఈ నెల 13వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఆన్‌లైన్‌లో డీసీ టికెట్లను విక్రయించడం ప్రారంభించింది. ప్రస్తుతం తక్కువ ధరల్లో టికెట్లు అందుబాటులో లేవు.రూ.2,200, రూ.2,500,రూ.3,000, రూ.3,500, అత్యధికంగా రూ.5,000 విలువ గల టికెట్ల ఖాళీలే కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారు వాటిని ఫిజికల్ టికెట్లుగా మార్చుకోవడానికి మున్సిపల్ స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్ వద్ద కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు వరకు టికెట్లు మార్చుకునే అవకాశం ఉంది.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
ఐపీఎల్ నేపథ్యంలో వైఎస్సార్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను శనివారం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే హోటల్‌తో పాటు స్టేడియంలోని ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు తగిన సూచనలు చేశారు. ఇరుజట్లకు సీజన్‌లో ఇదే తొలిమ్యాచ్ కావడంతో నెట్ ప్రాక్టీస్ చేసుకునే బీ గ్రౌండ్‌లోనూ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment