పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
● జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 29,927 మంది విద్యార్థులు
విశాఖ విద్య: పదో తరగతి పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 29,927 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వీరిలో 26,523 మంది రెగ్యులర్‌గా, 1,404 మంది ప్రైవేట్‌గా, 2,124 మంది ఒకేషనల్ ట్రేడ్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 15,094 మంది బాలురు, 13,429 మంది బాలికలు ఉన్నారన్నారు. 265 మంది దివ్యాంగ విద్యార్థుల సౌలభ్యం కోసం గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు 134 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో 48 ఏ కేటగిరీ కేంద్రాలు, 71 బీ కేటగిరీ కేంద్రాలు, 9 సీ కేటగిరీ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో ముందస్తుగా గుర్తించిన 6 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 134 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 134 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, 1,472 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్ ఆధారంగా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment