
దొండపర్తి (విశాఖ దక్షిణ): నగర పోలీస్ శాఖలో ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. తొలుతగా ముగ్గురు ఇన్‌స్పెక్టర్లపై వేటు పడింది. ఏడాది కాలంగా పోలీస్ శాఖలో షాడో కమిషనర్‌గా చక్రం తిప్పిన సిటీ స్పెషల్ బ్రాంచ్–2 సీఐ సి.హెచ్.ధనుంజయ నాయుడుతో పాటు మల్కాపురం సీఐ బి.లూధర్‌బాబు, హార్బర్ సీఐ పి.శోభన్‌బాబులను విశాఖ రేంజ్‌కు సరెండ్ చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఊహించినట్టుగానే వేటు..
పోలీస్ శాఖలో సీఐ ధనుంజనాయుడు ఏడాది పాటు ఒక వెలుగు వెలిగారు. షాడో కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడిచింది. కమిషరేట్ పరిధిలో ఎవరికి ఏ పని అవసరమైనా, ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా అతడిని సంప్రదిస్తే అయిపోతుందన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కొన్ని బదిలీల విషయంలో రూ.లక్షలు వసూలు చేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. బహిరంగంగానే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆ వాదనలకు మరింత బలం చేకూరినట్టయింది. అయితే కొత్త కమిషనర్ వచ్చిన కొద్ది రోజుల్లోనే తొలి వికెట్ ధనుంజయనాయుడే అని పోలీస్ శాఖలో ఏ ఇద్దరు కలిసినా చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. కమిషనరేట్‌లో గుసుగసులకు తగ్గట్టుగానే ప్రక్షాళన ఆయన నుంచే ప్రారంభమైనట్లు ఈ వేటుతో స్పష్టమవుతోంది. ఆయనతో పాటు అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారన్న ఆరోపణలపై మల్కాపురం సీఐ లూధర్‌బాబు, హార్బర్ సీఐ, కోర్టు లైజన్ ఆఫీసర్ పి.శోభన్‌బాబులపై వేటు పడినట్టు తెలుస్తోంది.
పోలీసు శాఖలో గుబులు : పోలీస్ కమిషనర్ సీఎం.త్రివిక్రమ్ వర్మ ప్రక్షాళనలకు పూనుకోవడంతో పోలీస్ శాఖలో గుబులు మొదలైంది. నిన్న మొన్నటి వరకు పైవాళ్ల ఆశీర్వాదాలు ఉన్నాయన్న ధీమాతో రెచ్చిపోయిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కీలక స్టేషన్లలో పోస్టింగ్‌లు సాధించిన వారిలో అలజడి రేగుతోంది. తరువాత ఎవరిపై వేటు పడనుందోనన్న భయం పట్టుకుంది.
త్వరలో మరికొంత మందిపై వేటు?
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంత మంది ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల తీరు పట్ల అనేక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు అవినీతి ఆరోపణలతో పాటు మరోవైపు కేసుల నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని కేసుల విషయంలో ఫిర్యాదుదారులపైనే బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. కేసుల నమోదు సంఖ్య విషయంలో కూడా తప్పుడు లెక్కలు చూపించినట్లు ఉన్నతాధికారులు ఆలస్యంగా గ్రహించి కొద్ది నెలల క్రితం మూడు స్టేషన్ల సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించిన సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా నగరంలో జరిగిన భారీ కార్యక్రమాలు వీవీఐపీ, వీఐపీ పర్యటనల విషయంలో పోలీసుల ఓవర్ యాక్షన్‌పై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటిపై పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ ఇప్పటికే దృష్టి సారించినట్లు సమాచారం. పోలీస్ శాఖలో సమూల ప్రక్షాళన దిశగా చర్యలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహిరించే సీఐలు, ఎస్‌ఐలపై దృష్టి పెట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటువంటి వారి జాబితాను సిద్ధం చేసి దశల వారీగా ఒక్కొక్కరిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment