విశాఖపట్నం: ఎంవీపీ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధి ఆదర్శనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రౌడీషీటర్ వాసుపల్లి లక్ష్మణరావు అలియాస్ క్రాంతి (50)ని దారుణంగా హత్యచేశారు. ఈ ఘటనలో హత్యకు గురైన క్రాంతిపై గతంలో రెండు హత్య కేసులు నమోదై ఉన్నాయి. గత కొన్నాళ్లుగా అతడు వివాదాలకు దూరంగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన క్రాంతి అనుపమ బార్ ప్రాంగణంలో మద్యం సేవించాడు. అనంతరం అక్కడ చీకులు అమ్ముతున్న వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడి సమీపంలో రోడ్డుకు అటువైపు ఉన్న మెడ్‌ప్లస్ మెడికల్ షాపు వద్ద మందులు కొనడానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మెడ్‌ప్లస్ షాపులోకి వెళుతున్న అతనిపై కత్తులతో దాడి చేశారు. మెడ, నుదిటి భాగంలో తీవ్రంగా నరకడంతో క్రాంతి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
కొడుకుతో కలిసి హత్యలో పాల్గొన్న వ్యక్తే ?
2022 ఆగస్టు 17న జరిగిన అదే ప్రాంతంలో జరిగిన ఓ హత్య ఘటనలో క్రాంతి కొడుకు శ్యామ్‌తో పాటు పాల్గొన్న ఎర్రయ్య అనే వ్యక్తే క్రాంతిని హతమార్చినట్లు సమాచారం. ఆ హత్య కేసులో క్రాంతి కొడుకు శ్యామ్ ఏ1 కాగా ఎర్రయ్య ఏ3 ముద్దాయిగా ఉన్నాడు. ఆ ఘటన అనంతరం క్రాంతి తన కొడుకు శ్యామ్ బెయిల్ కోసం, ఇతర అవసరాల కోసం తప్ప ఆ హత్యకు సహకరించిన తనని పట్టించుకోలేదనే కక్షతో కొన్నాళ్లుగా ఎర్రయ్య రగిలిపోతున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే వీరు ఇరువురు కొంతకాలంగా గొడవ పడుతున్నారు. అవకాశం కోసం ఎదురు చూసిన ఎర్రయ్య గురువారం మెడికల్ షాపునకు వచ్చిన క్రాంతిపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది. ఈ ఘటనలో అతనికి వేరే వ్యక్తులు కూడా సహకారం అందించినట్లు పలువురు చెబుతున్నారు.
క్రాంతిపై గతంలో కేసులు..
హత్యకు గురైన క్రాంతిపై నగరంలో రెండు హత్య కేసులు నమోదై ఉన్నాయి. పీఎం పాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ హత్య కేసును కోర్టు కొట్టేయగా.. 2014లో 3వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. ఈ ఘటన అనంతరం క్రాంతి భార్య విలేకరులతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తన భర్తను హత్య చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ విషయం ఆయనే పలుమార్లు తనకు చెప్పాడన్నారు. ఇందుకు అవసరమైన డబ్బులు వేరే వ్యక్తులు సమకూరుస్తున్నారన్నారు. ఎవరు హత్య చేశారనే విషయాన్ని పోలీసులు నిగ్గుతేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ హత్య నేపథ్యంలో క్రాంతి కొడుకుతో పాటు పలువురిని ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment