
విశాఖతో ప్రజా గాయకుడు గద్దర్‌కు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ప్రకృతి రమణీయతకు ఎంతో ముగ్ధులయ్యే వారు.
సాక్షి, విశాఖపట్నం: విశాఖతో ప్రజా గాయకుడు గద్దర్‌కు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ప్రకృతి రమణీయతకు ఎంతో ముగ్ధులయ్యే వారు. విశాఖ వచ్చినప్పుడల్లా బీచ్‌లోనే ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపేవారు. అలల అందాన్ని తనివి తీరా ఆస్వాదించేవారు. వైజాగ్‌లాగే ఇక్కడ ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఉంటారని తరచూ కొనియాడేవారు. విశాఖ ప్రశాంతత చూస్తే కవిత్వం, ఉద్వేగం కలగలిసి ఉప్పొంగుతుందని తన స్నేహితులు, ఆత్మీయులతో చెప్పేవారు.
విశాఖలో దొరికే తాజా చేపలతో వండే కూరంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే విశాఖ వచ్చినప్పుడు తాను బావగా పిలుచుకునే ప్రజాకవి వంగపండు ప్రసాదరావు ఇంట్లో తనకిష్టమైన చేపలకూరను వండించుకుని తినేవారు. ఎంతో నిరాడంబర జీవితాన్ని గడిపే గద్దర్.. వైజాగ్ వస్తే హోటళ్లలో గడపడానికి ఇష్టపడేవారు కాదు.
ఎవరైనా ఆయనకు హోటళ్లలో గది బుక్ చేస్తామన్నా వద్దని, తన ప్రియమైన బావ (వంగపండు) ఇంట్లోనే ఉంటానని చెప్పేవారు. ఇక విశాఖ వచ్చినప్పుడు వంగపండుతో కలిసి గజ్జె కట్టి పాటలు పాడే వారు. తాను ఎక్కువగా వంగపండు రాసిన పాటలనే పాడతానని గద్దర్ చెప్పేవారు. 2020 ఆగస్టు 4న వంగపండు కన్నుమూయగా.. సరిగ్గా మూడేళ్ల రెండు రోజుల తర్వాత గద్దర్ తన బావ చెంతకే చేరడం యాదృచ్ఛికం!
సమ్మె నీ జన్మ హక్కురన్నో..
ఇక కార్మికుల పక్షాన పాటల రూపంలో ఉద్యమ స్ఫూర్తినిచ్చే గద్దర్ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ యత్నాలపై కూడా చూస్తూ ఊరుకోలేదు. ప్రైవేటీకరణకు నిరసనగా గళమెత్తడమే కాదు.. ‘ఉక్కు సత్యాగ్రహం’పేరుతో నిర్మిస్తున్న సినిమాలో నటించడానికి విశాఖ వచ్చారు. సొంతంగా పాట రాసి.. పాడారు.
‘అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న..
ఎన్నాళ్లు ఈ బతుకు.. ఎదురు తిరగవన్నో..
సమ్మె నీ జన్మ హక్కురన్నో..
దాని ఆపే మొనగాడెవ్వడన్న
ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో మునిగింది..
విశాఖ సంద్రము శోకమై పొంగింది..
అమరుల త్యాగాలు.. విశాఖ ఉక్కు ఫలాలు..
నెత్తురు చుక్కలు ఎరుపు.. మన స్టీలుపై
మెరిసేటి మెరుపు..
ప్రైవేట్ వాడికి ఫ్యాక్టరీ పాతరేస్తే..
ఉన్న కొలువు ఊడి అన్నమో సున్నము..!’
అంటూ గొంతెత్తారు. ఈ సినిమా మరికొద్దిరోజుల్లో విడుదల కానున్న తరుణంలో గద్దర్ కన్నుమూయడాన్ని విశాఖ వాసులు, ముఖ్యంగా ఉక్కు కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా.. ఉక్కు ఉద్యమం 900 రోజుకు చేరిన సందర్భంగా ఈ జూలై 31 ఆయన విశాఖకు రావాల్సి ఉంది. అయితే ఆరో గ్యం బాగాలేకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడ్డాక వస్తానని చెప్పినట్లు ఉక్కు పోరాట కమిటీ నాయకులు తెలిపారు.
మూగబోయిన చైతన్య స్వరం
పీడిత ప్రజల యుద్ధనౌక గద్దర్ లేరనడానికి మాటలు రావడం లేదు. గద్దర్ అనే పదానికి పరిచయం అక్కరలేదు. వివరణ అవసరం లేదు. తన గళంతో పల్లె జానపదానికి బ్రహ్మరథం పట్టిన మహా గాయకుడు. పీడిత ప్రజల పక్షాన స్వర పోరాటం చేసిన గానయోధుడు గద్దర్. విప్లవ చైతన్య స్వరం మూగబోయింది.
– ఎం.వెంకటరావు,చైర్మన్, ఏపీ స్టేట్ కాంగ్రెస్ ఓబీసీ
గద్దర్ లేరంటే నమ్మలేకపోతున్న..
ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని ఎండగట్టిన విప్లవ స్వరం మూగబోయింది. శ్రమైక్య జీవుల కోసం తపనపడే ఆ గళం ఇక వినిపించదనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గద్దర్ గళం అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది.
– దేవీశ్రీ, ప్రజాగాయకుడు