సాక్షి, విశాఖపట్నం: అత్యంత అరుదైన సీ హార్స్ మత్స్యకారుల వలలకు చిక్కుతున్నాయి. విశాఖ తీరంలో అప్పుడప్పుడు ఇవి దర్శనమిస్తున్నాయి. ఇవి రెండు మూడు అంగుళాల సైజులో రొయ్యలను పోలి ఉంటాయి. ఇవి రొయ్యల్లో కలిసిపోతుండడం వల్ల మత్స్యకారులు వీటిని పెద్దగా పట్టించుకోరు. తాజాగా మంగళవారం విశాఖ మత్స్యకారుల వలకు ఇవి దొరికాయి. నగరంలోని ఒక వ్యక్తి సాయంత్రం హార్బర్‌లో రొయ్యలను కొనుగోలు చేశాడు. ఇంటికి తెచ్చి చూడగా రొయ్యలతో పాటు ఈ సీ హార్స్ కూడా అందులో ఉన్నట్టు కె.విజయ్‌కుమార్ అనే వ్యక్తి గుర్తించారు.
దొరికిన సీ హార్స్‌ను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడంతో ఈ విషయం బయట పడింది. కాగా సముద్ర గుర్రంగా పిలిచే ఈ చిన్న చేపలు (సీ హార్స్) ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండల, సమశీతోష్ణ జలాల్లో కనిపిస్తాయి. వీటికి వంకర మెడలు, పొడవైన గొంతు, తల, శరీరం నిటారుగా ఉండి తోక వంకరగా ఉంటుంది. ఈ జంతువులకు నోట్లో పళ్లుండవు. పగడపు దిబ్బలు, మడ అడవులు వంటి ప్రాంతాల్లో నివశిస్తాయి.
నిట్టనిలువుగా నిలిచి ఈదుతాయి. మగ సముద్రపు గుర్రాలు తమ శరీరం ముందు భాగంలో సంతానాన్ని పొదగడానికి అనువైన ఒక సంచి వంటి అరను కలిగి ఉంటాయి. జతకట్టే సమయంలో ఆడ చేప గుడ్లను ఈ మగ చేప సంచిలోకి విడుస్తుంది. అప్పుడు మగ చేప వాటిని అంతర్గతంగా ఫలదీకరణ చేసి పిల్లలు గుడ్లలో నుంచి బయటకు వచ్చాక వాటిని నీటిలోకి విడుదల చేస్తుందని మత్స్యశాఖ జిల్లా అధికారి జి.విజయ ‘సాక్షి’కి చెప్పారు. విశాఖ ప్రాంత సముద్ర జలాల్లో సీ హార్స్‌ల ఉనికి అరుదు అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment