రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్స్ లైన్ వద్ద ప్రయాణికులు
సాక్షి, విశాఖపట్నం : బాలేశ్వర్ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా.. ఆ మహా విషాదం ఇంకా కళ్లముందే కదులుతోంది. ఇంతలోనే మరో ఘోరం.. మాటలకందని విషాదం.. కళ్లు మూసి తెరిచేలోపు క్షణాల్లో ప్రమాదం జరిగిపోయింది. ఆదివారం రాత్రి విశాఖపట్నం నుంచి బయల్దేరిన పలాస రైలును, వెనుక నుంచి వెళ్లిన విశాఖ–రాయగడ రైలు విజయనగరం జిల్లా చినరావుపల్లి సమీపంలో ఢీకొంది.
ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 30 మందికిపైగా గాయపడ్డారు. విషాద ఘటన గురించి తెలుసుకున్న విశాఖవాసులు ఉలిక్కిపడ్డారు. తమ వారి యోగక్షేమాల కోసం ఆరా తీసేందుకు రైల్వే స్టేషన్‌కు పరుగులు తీశారు. వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు.. ఘటన జరిగిన వెంటనే ప్లాట్‌ఫామ్ నం.1లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం వచ్చిన వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తూ ఘటనా స్థలంలో ఉన్న రెస్క్యూ బృందానికి సమాచారం అందిస్తున్నారు. వారంతా ఎలా ఉన్నారో తెలుసుకొని తిరిగి అక్కడకు వచ్చినవారికి తెలియజేస్తున్నారు.
రైలు ప్రమాదం బాధాకరం
రైలు ప్రమాద ఘటనపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రైల్వే డీఆర్‌ఎంకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక పార్టీ శ్రేణులతో మాట్లాడి సంఘటన ప్రాంతంలో సత్వర సహాయక చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ తరహా ఘటనలు పునారావృతం కాకుండా సంబంఽధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు
ఈ ఘటనతో విజయనగరం వైపు వెళ్లాల్సిన, విజయనగరం వైపు నుంచి రావలసిన పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
పలు రైళ్లు రద్దు కాగా ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్‌లలో నిలిపివేశారు.
కేజీహెచ్‌లో ప్రత్యేక బృందాలు
ప్రమాద ఘటన తెలుసుకున్న కలెక్టర్ డా.మల్లికార్జున కేజీహెచ్ వైద్యులను అప్రమత్తం చేశారు. కేజీహెచ్ క్యాజువాలిటీలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసి 0891–2558494 నంబర్‌ని అందుబాటులో ఉంచారు. అదేవిధంగా రైలు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఇద్దరు వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలంటూ ఆదేశించారు. వైద్యులను సంప్రదించేందుకు 8341483151, 9688321986 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 9030226621, 7036111169, 08912590102 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో హెల్ప్ లైన్ నెంబర్ 0891–2746330 / 0891–2744619.
రైలు ప్రమాద బాధితురాలికి పెందుర్తిలో చికిత్స
పెందుర్తి: రైలు ప్రమాదంలో గాయపడిన రేజేటి వరలక్ష్మి అనే మహిళ పెందుర్తి ప్రభుత్వ సీహెచ్‌సీలో చికిత్స పొందుతుంది. పార్వతీపురానికి చెందిన వరలక్ష్మి పెందుర్తిలోని కుమార్తె ఇంటికి కొద్దిరోజుల క్రితం వచ్చింది. ఆదివారం సాయంత్రం తిరిగి పార్వతీపురం వెళ్లేందుకు పెందుర్తి రైల్వే స్టేషన్‌లో రాయగడ రైలు ఎక్కింది. ఆ రైలు అలమండ వద్ద ప్రమాదానికి గురైన ఘటనలో వరలక్ష్మి కాలికి తీవ్ర గాయమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని వరలక్ష్మిని పెందుర్తి సీహెచ్‌సికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment