ఆరిలోవ : విశాఖ కేంద్ర కారాగారంలో ప్రక్షాళన చర్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు ఆరుగురికి మెమోలు జారీ చేశారు. బుధవారం ఇద్దరికి, మంగళవారం నలుగురికి మెమోలు జారీ చేశారు. ఇటీవల ఇక్కడ పాలన విభాగం అస్తవ్యస్తంగా మారి వార్తలకెక్కిన విషయం తెలిసిందే. జైలు లోపలకు గంజాయి తరలించడం, ఖైదీల బేరక్ వద్ద సెల్‌ఫోన్‌లు లభించడం, ఓ రిమాండ్ ఖైదీని క్వారెంటైన్‌లో ఉంచకుండా నేరుగా బేరక్‌లోకి తరలించడంతో ఆత్మహత్య చేసుకోవడం తదితర పరిణామాలు జరిగాయి. ఆయా వ్యవహారాల్లో పలువురు అధికారులకు బదిలీలు కూడా జరిగాయి. పరిపాలన యంత్రాంగాన్ని గాడిన పెట్టడానికి రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, ఉన్నతాధికారుల ఆదేశాలు సక్రమంగా అమలు చేయకపోవడం తదితర విషయాలు దర్యాప్తులో వెల్లడయ్యాయి. దీంతో అధికారులపై చర్యలు చేపట్టారు. బుధవారం జైలర్లు పి.కుసుకుమార్, ఆర్.చిన్నారావుకు మెమోలు జారీ చేయగా.. మంగళవారం గతంలో ఇక్కడ పనిచేసిన సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్, అడిషనల్ సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు, ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ జవహర్‌బాబు, జైలర్ సీహెచ్ శ్రీనివాస్‌కు రాష్ట్ర జైళ్ల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార విశ్వజిత్ మెమోలు జారీ చేశారు. ఇంకొందరికి మెమోలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment