చార్‌ధామ్ చూసొద్దామా
సీతమ్మధార: చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం మొదటి ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(జీఎంవీఎన్) ప్రజా సంబంధాల అధికారి వీరేందర్ సింగ్ రాణా తెలిపారు. ఆశీలమెట్టలోని ఒక హోటల్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలు హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. 16 రోజుల పూర్తి స్థాయి ప్యాకేజీ టూర్ ఈ ఏడాది మే 8న ప్రారంభమవుతుందని, ప్రస్తుతం బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ప్రతీ కోచ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, సీసీ టీవీ కెమెరాలు, టూర్ మేనేజర్, హౌస్ కీపింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది ఉంటారని వివరించారు. టూర్ టైమ్స్ రీజినల్ మేనేజర్ రమేశ్ అయ్యంగార్ మాట్లాడుతూ భారతీయ రైల్వేలు, టూర్ టైమ్స్ భాగస్వామ్యంతో ఈ పవిత్ర యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక ప్యాకేజీలో సైట్ సీయింగ్, రాత్రి బస ఉన్న ప్రాంతాల్లో హోటల్ వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. యాత్ర మొత్తంలో రైలు, హోటళ్లలో దక్షిణ భారతీయ భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు తమ లగేజీని కోచ్‌లోనే ఉంచుకుని యాత్రా స్థలాలను సందర్శించవచ్చని, ఇది యాత్రను మరింత సౌకర్యవంతంగా మారుస్తుందన్నారు. వృద్ధులకు ఇది ఒక ప్రత్యేకమైన టూర్ అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ, ఎల్‌ఎఫ్సీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని, రైల్వే మంత్రిత్వ శాఖ 33 శాతం రాయితీని అందిస్తోందన్నారు. రాయితీ పోనూ థర్డ్ ఏసీకి రూ.70,500, సెకెండ్ ఏసీకి రూ.75,500, ఫస్ట్ ఏసీకి రూ.82,500, స్లీపర్‌కు రూ.58,500 చార్జీలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. బుకింగ్, ఇతర సమాచారం కోసం www. tourtimes. in వెబ్‌సైట్‌ను, 91600 21414, 91600 91414 నంబర్లను సంప్రదించవచ్చు. సమావేశంలో ఫిజీషియన్, సైకియాట్రిస్ట్ నందిని పాల్గొన్నారు.
మే 8 నుంచి ‘భారత్ గౌరవ్’ప్రత్యేక రైలు యాత్ర
Comments
Please login to add a commentAdd a comment