స్టీల్‌ప్లాంట్‌లో వీఆర్‌ఎస్ ప్రక్రియ ఆరంభం
ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బుధవారం వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) అమలు ప్రక్రియ ప్రారంభమైంది. కొంతమందికి సంబంధించి వీఆర్‌ఎస్ ఆమోదం, తిరస్కరణ నోటీసులు విడుదలయ్యాయి. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల తగ్గింపు కార్యక్రమంలో భాగంగా గత నెల 15న యాజమాన్యం వీఆర్‌ఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 31వ తేదీ నాటికి 1,613 మంది ఉద్యోగులు (అధికారులు, కార్మికులు కలిపి) వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేశారు. సుమారు 145 మంది దరఖాస్తుల ఉపసంహరణకు వినతులు అందజేశారు. అప్పటి నుంచి యాజమాన్యం వడపోత కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నాన్ వర్క్స్ విభాగాలకు చెందిన కార్మికులు, ఈ–4 గ్రేడ్ స్థాయి వరకు అధికారులకు సంబంధించి 18 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు అంగీకరించినట్టు ఈపీఎస్‌ఎస్ పోర్టల్లో పొందుపరిచారు. ఇక ఈ–5, ఆపై అధికారుల జాబితా విడుదల కావాల్సి ఉంది. అదే విధంగా వర్క్స్‌కు సంబంధించిన విభాగాల కార్మికులు, అధికారుల జాబితా గురువారం విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. నోటీసులు ఉద్యోగులకు అందిన నాటి నుంచి నోటీసు పిరియడ్‌గా పరిగణిస్తామని పేర్కొన్నారు. క్యాజువల్ లీవ్, ఆప్షనల్ హాలిడేలు నిష్పత్తి ప్రాతిపదికన మాత్రమే వినియోగించుకోవాలని, నోటీసు పీరియడ్‌లో అర్జిత సెలవులు (ఈఎల్), సగం అర్జిత సెలవులు (హెచ్‌పీఎల్)లు వినియోగించుకోరాదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment