డీఆర్‌ఎంగా వచ్చేందుకు అధికారుల వెనకడుగు
● డీఆర్‌ఎం సౌరభ్‌పై సీబీఐ దాడుల తర్వాత అధికారుల గుండెల్లో దడ ● గతేడాది డిసెంబర్‌లో డీఆర్‌ఎంగా లలిత్‌బోరా నియామకం ● బాధ్యతలు చేపట్టకుండా వేరే ప్రాంతానికి వెళ్తేందుకు ప్రయత్నాలు ● ఇన్‌చార్జి డీఆర్‌ఎం పాలనలోనే కార్యకలాపాలు
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు రైల్వే డివిజన్‌లో పనిచేసేందుకు ఉన్నతాధికారులు ఉలిక్కి పడుతున్నారు. సీబీఐ దాడుల్లో డీఆర్‌ఎం దొరికిన తర్వాత ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ సుముఖత చూపించడం లేదు. గతేడాది డిసెంబర్‌లో డీఆర్‌ఎంని నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసినా ఆయన ఇంతవరకు బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పుడు ఆయన వేరే చోటికి బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలలుగా ఇన్‌చార్జ్ నీడలోనే డివిజన్ వ్యవహారాలు నడుస్తుండటంతో రూ.వందల కోట్ల పనులకు చెందిన టెండర్లు స్తంభించిపోయాయి.
ఇన్‌చార్జి పాలనలో..
వాల్తేరు రైల్వే డివిజన్‌కు దాదాపు 130 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 21 పాసింజర్ హాల్ట్‌లతో కలిపి మొత్తం 115 రైల్వే స్టేషన్‌లు డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ జోన్‌లో సరకు రవాణాతో పాటు ప్రయాణికుల రాకపోకల ఆదాయంలోనూ వాల్తేరు డివిజన్ నంబర్‌వన్‌గా నిలిచింది. అలాంటి డివిజన్ ఇప్పుడు ఇన్‌చార్జి హయాంలో నడుస్తోంది. వాల్తేరు చరిత్రలో ఇన్ని నెలల పాటు ఇన్‌చార్జి డీఆర్‌ఎం పాలనలో నడవడం ఇదే ప్రథమమని ఉద్యోగులు చెబుతున్నారు. సీబీఐ దాడుల్లో పట్టుబడిన సౌరభ్‌కుమార్ స్థానంలో నవంబర్ 20న ఇన్‌చార్జి డీఆర్‌ఎంగా వాల్తేరు ఏడీఆర్‌ఎం మనోజ్‌కుమార్ సాహూని నియమించారు. ఆ తర్వాత డిసెంబర్ 26న లలిత్‌బోరాని డీఆర్‌ఎంగా నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఇప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. వాల్తేరు డివిజన్‌కు వస్తే తన పరిస్థితి ఏంటోనన్న భయం ఆయనలో పట్టుకుందని డివిజన్ అధికారులు చెబుతున్నారు. అందుకే ఆయన ముంబై లేదా ఇతర చోటుకి బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బోర్డు కొత్తవారిని నియమించేందుకు ప్రయత్నిస్తోంది.
ఉద్యోగుల్లో భయాందోళనలు
ముంబైలో గతేడాది నవంబర్ 16న వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డివిజన్‌లోని ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్‌ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఉద్యోగుల్లో ఒకరిని విజయనగరం బదిలీ చేసేశారు. మిగిలిన వారిని పలుమార్లు సీబీఐ అధికారులు విచారించి.. అనేక విషయాలపై ఆరా తీశారు. దీంతో ఉన్నతాధికారులు ఏ వ్యవహారంలో తలదూర్చితే ఏం జరుగుతుందో.. ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు.
రూ.వందల కోట్ల పనులకు బ్రేక్
ఘన చరిత్ర ఉన్న వాల్తేరు పరువుని లంచావతారం ఎత్తిన డీఆర్‌ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ పట్టాలు తప్పించేశారు. సొంత అజెండాపైనే దృష్టిసారించిన ఆయన డివిజన్ అబివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన హయాంలో వచ్చిన కొత్త రైళ్లన్నీ.. గత డీఆర్‌ఎం అనూప్‌కుమార్ సత్పతి చేసిన ప్రతిపాదనలే తప్ప.. తన మార్కు అంటూ ఎక్కడా మచ్చుకు కూడా చూపించలేకపోయారు. అనూప్‌కుమార్ సత్పతి హయాంలో డివిజన్ ఆదాయంలోనూ, రైళ్ల రాకపోకల్లోనూ వెలుగొందింది. తర్వాత ప్రాభవం కనుమరుగైంది. పాతాళానికి పడిపోయిన డివిజన్‌లో డీఆర్‌ఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నదానిపై అంతటా సందిగ్థత నెలకొంది. దీంతో పాటు ప్రస్తుతం ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో పెద్ద టెండర్లకు అనుమతులు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. గత డీఆర్‌ఎం లంచాల మేత కారణంగా డివిజన్ పరిధిలో పనులకు టెండర్లు ఆహ్వానించినా ఎవరూ ముందుకురాలేదు. ఇప్పుడు శాశ్వత డీఆర్‌ఎం లేకపోవడంతో రూ.వందల కోట్ల పనులకు ఆగిపోయాయి. వీలైనంత త్వరగా డీఆర్‌ఎంని నియమించాలని రైల్వే యూనియన్లు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment