సాగరతీరంలో శోభాయాత్ర
● వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
ఏయూక్యాంపస్: విశాఖ సాగర తీరం హరినామ సంకీర్తనలతో పులకించింది. హరే కృష్ణ హరే కృష్ణ...హరే రామ హరే రామ అంటూ భక్తజనం నృత్యాలు చేశారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో.. విశ్వశాంతిని కాంక్షిస్తూ బీచ్‌రోడ్డులోని పార్క్ హోటల్ కూడలి నుంచి గోకుల్ పార్క్ వరకు గురువారం నిర్వహించిన శోభాయాత్ర నగరంలో ఆధ్యాత్మిక శోభను నింపింది. పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంపై భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, రాధా మదన మోహన స్వామి, నితాయి గౌరాంగాల విగ్రహాలను ఊరేగించారు. భక్తులు రథాన్ని తాళ్లతో లాగుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ అంతర్జాతీయ వ్యవస్థాపకుడు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులకు మహా కుంభమేళాలో అఖిల భారతీయ అఖాడా పరిషత్ ‘విశ్వగురు’ బిరుదు ప్రదానం చేసిన సందర్భం, 52 సంవత్సరాల కిందట విశాఖలో జరిపిన పాదయాత్రను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శోభాయాత్రలో భాగంగా వాయిద్యాలు, కోలాటం, సంకీర్తనలతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. సందర్శకులకు దారిపొడవునా ప్రసాదం పంపిణీ చేశారు. హవా మహల్‌లో రాధా మదన్ మోహన్ స్వామి, నితాయి గౌరాంగ, భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల విగ్రహాలకు హారతి ఇచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దారిపొడవునా భక్తి గీతాలు ఆలపిస్తూ, కోలాటం ఆడారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, తూర్పు ఎమ్మెల్యే వి.రామకృష్ణబాబు, హరేకృష్ణ మూవ్‌మెంట్–అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు అమితాసన దాస స్వామీజీ, విశాఖ అధ్యక్షుడు నిష్క్రించిన భక్త దాస తదితరులు పాల్గొన్నారు.
సాగరతీరంలో శోభాయాత్ర
Comments
Please login to add a commentAdd a comment