కమీషన్ల దందా!
పేదల ఇళ్లపై
విశాఖలోనే రూ.5 కోట్లకుపైగా కలెక్షన్
● ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున వసూలు ● కాంట్రాక్టర్లకు గృహ నిర్మాణ శాఖ అధికారుల హుకుం ● లేదంటే బిల్లులు నిలిపేస్తామని బెదిరింపులు ● దుకాణం తెరిచిన నామినేటెడ్ పోస్టులోని కూటమి నేత ● కాంట్రాక్టర్లతో నేరుగా డీలింగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
పేదల ఇళ్ల నిర్మాణాలపై కూటమి నేతలే కాదు అధికారులు కూడా గెద్దల్లా వాలిపోతున్నారు. ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున ఇస్తేనే బిల్లులు చేస్తామంటూ కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు తెగబడుతున్నారు. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఓ అధికారి కాంట్రాక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసేశారు. ఒకవేళ అడిగిన మొత్తం ఇవ్వకపోతే బిల్లులు చేసేది లేదని తెగేసి చెప్పినట్టు సమాచారం. తమకు వారం వారం బిల్లులు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో కాంట్రాక్టర్లు కూడా అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒక్క విశాఖ జిల్లాలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఇంకా ప్రారంభం కావాల్సిన ఇళ్ల నుంచి సదరు అధికారి ఏకంగా రూ.5 కోట్లకుపైగా వసూలు చేసేందుకు సిద్ధపడటం గమనార్హం. మరోవైపు నామినేటెడ్ పోస్టులోని కూటమి నేత ఒకరు కూడా వసూళ్ల దుకాణం తెరిచినట్టు తెలుస్తోంది. నేరుగా కాంట్రాక్టర్లతో డీలింగ్ చేసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు తెలియకుండా ఏ ఒక్కరి బిల్లు కూడా జారీ కాకూడదంటూ హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఒక వైపు అధికారులు, మరో వైపు కూటమి నేత వసూళ్లతో పేదల ఇళ్ల నిర్మాణం నాసిరకంగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మీరు ఎలా ఇళ్లు నిర్మించి ఇచ్చినా.. ఎటువంటి విచారణ లేకుండా బిల్లులు మంజూరు చేస్తామంటూ హామీ లభిస్తుండటంతో కాంట్రాక్టర్లు కూడా అడిగిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
కమీషన్లు రూ. కోట్లలోనే..
ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఇళ్లను గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ నగర పరిధిలో ఇళ్లు మంజూరు చేసినప్పటికీ.. టీడీపీ నేతలు కేసులు వేసి స్థలాలు ఇవ్వకుండా తాత్సారం చేశారు. చివరకు కోర్టులో కేసులు తేలిన తర్వాత జగనన్న కాలనీల్లో 2023 చివర్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా విశాఖ పరిధిలో నిర్మాణం పూర్తయిన ఇళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇంకా నిర్మాణంలో ఉన్నవి, ప్రారంభించాల్సిన ఇళ్ల సంఖ్య లక్షకు పైగానే ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు కలిసొచ్చింది. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలన్న కేంద్రం ఆదేశాలతో కాంట్రాక్టర్లు పరుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా వసూళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున ఇవ్వాలంటూ గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారి ఒకరు టార్గెట్ విధించారు. ఇది చిన్న మొత్తంగా కనిపిస్తున్నప్పటికీ.. మొత్తం లెక్కిస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒక్క విశాఖ జిల్లాలోనే నిర్మాణంలో ఉన్నవి, ప్రారంభం కావాల్సిన ఇళ్ల సంఖ్య 1,06,303 ఉన్నాయి. అంటే ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున లెక్కిస్తే సదరు అధికారి వసూళ్ల లక్ష్యం రూ.5.31 కోట్లకు పైమాటే. అనకాపల్లి, అల్లూరి జిల్లాలను కూడా కలిపి లెక్కిస్తే గృహ నిర్మాణ శాఖ అధికారుల వసూళ్ల మొత్తం సుమారు రూ.10 కోట్లకు చేరుతుంది. అంతేకాకుండా కింది స్థాయి లోని అధికారులతో పాటు నామినేటెడ్ పోస్టులోని మరో కూటమి నేత కూడా ఇంటికి ఇంత చొప్పున వసూళ్లకు తెగబడినట్టు సమాచారం. ఈ మొత్తం కలుపుకుంటే రూ.15 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
పేదల ఇళ్ల నిర్మాణాలు
విశాఖ జిల్లాలో...
మంజూరైన ఇళ్లు 1,14,795
పూర్తయిన ఇళ్లు 8,492
నిర్మాణ పనులు
మొదలైన ఇళ్లు 91,219
ప్రారంభం కావల్సినవి 15,084
అనకాపల్లి జిల్లాలో..
మంజూరైన ఇళ్లు 65,800
పూర్తయిన ఇళ్లు 28,910
వివిధ దశల్లో
నిర్మాణంలోని ఇళ్లు 19,278
ప్రారంభం కావల్సినవి 17,627
ఇళ్ల నాణ్యతపై నీలినీడలు?
కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలపై కినుక వహించింది. గృహ నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయంటూ నానా యాగీ చేసింది. దీనిపై విచారణ చేపట్టాలంటూ హడావుడి చేసింది. గృహ నిర్మాణ లబ్ధిదారులందరూ అసలైన అర్హులు కావడంతో కిమ్మనకుండా ఉండిపోయింది. విచారణ పేరుతో పుణ్యకాలం కాస్తా గడిపింది. గడువులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయక పోతే రాయితీ మొత్తాన్ని ఇవ్వబోమని కేంద్రం నుంచి గట్టిగా వార్నింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇదే అదనుగా కట్టే ప్రతీ ఇంటికీ తమ వాటాగా రూ.500 ఇవ్వాలంటూ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కాంట్రాక్టర్లను డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు నామినేటెడ్ పోస్టులోని కూటమి నేతతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా తమ వంతు వాటా ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలన్న ఆదేశాలు ఒకవైపు.. వసూళ్ల డిమాండ్ మరోవైపు ఉండటంతో పేదల ఇళ్ల నిర్మాణాల నాణ్యతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
అల్లూరి జిల్లాలో..
మంజూరైన ఇళ్లు 56,852
పూర్తయిన ఇళ్లు 3,350
వివిధ దశల్లో
నిర్మాణంలోనివి 49,798
ప్రారంభం కావాల్సినవి 3,527
కమీషన్ల దందా!
కమీషన్ల దందా!
Comments
Please login to add a commentAdd a comment