మద్యానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య
గోపాలపట్నం: మద్యం కోసం తల్లికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఓ యువకుడు ఉరి వేసుకున్నాడు. గోపాలపట్నం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్ ఈ బ్లాక్ నాలుగు కుళాయిల వద్ద గోక శివకృష్ణ(32) తల్లిదండ్రులతో నివాసముంటున్నాడు. తండ్రి, తమ్ముడితో కలిసి ఆటోలో ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండేవాడు. మద్యానికి బానిస కావడంతో అతని తండ్రి, తమ్ముడు ఈ వ్యాపారం చూసుకుంటున్నారు. కాగా.. శివకృష్ణ సోమవారం ఉదయం ఫూటుగా మద్యం సేవించాడు. మధ్యాహ్న సమయంలో మద్యం కోసం డబ్బులు కావాలని తల్లి దమయంతిని అడగ్గా.. ఆమె లేవని చెప్పింది. సాయంత్రం భర్త, కొడుకు వచ్చే సరికి టీ పెట్టేందుకని ఆమె పాలు ప్యాకెట్ కోసం బయటకు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి శివకృష్ణ ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని కనిపించడంతో కేకలు వేసింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆమె భర్త, చిన్న కుమారుడికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత శివకృష్ణను కిందకు దించి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ గొలగాని అప్పారావు నేతృత్వంలో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment