● కూటమి దుష్టపాలనకు టీచర్లు గట్టిగా బుద్ధి చెప్పారు ● గ
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టులాంటిదని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాకిచ్చారని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి రఘువర్మ ఘోర పరాజయం తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులు మాట మార్చారని మండిపడ్డారు. గెలిచిన గాదె శ్రీనివాసులునాయుడు తమ అభ్యర్థే అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రఘువర్మను గెలిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమావేశాలు నిర్వహించారని, తన ఎక్స్ ఖాతాలో రఘువర్మకు టీడీపీ శ్రేణులు ఓటెయ్యాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజులాంటి సీనియర్ నాయకులు బహిరంగంగానే పిలుపునిచ్చారని పేర్కొన్నారు. వీటితో పాటు రఘువర్మను గెలిపించాలని టీడీపీ నాయకుల పేరుతో పత్రికా ప్రకటనలు కూడా వచ్చాయన్నారు. జనసేన పార్టీ సైతం తన అధికారిక ఖాతాలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రఘువర్మను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గాదె శ్రీనివాసులునాయుడుకి మద్దతు ఇచ్చినట్టు కూటమి నాయకులు ఒక్క ఆధారమైనా చూపించగలరా? అని ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు మీ పేరు పెట్టుకోవద్దంటూ ఎద్దేవా చేశారు.
ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం
9 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వచ్చిన వ్యతిరేకతకి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఉద్యోగుల్లో దాదాపు 35 శాతంగా ఉన్న టీచర్లు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్నారు. విద్యాశాఖను నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ టీచర్ల సమస్యలు తీర్చడంలో విఫలం కావడంతోనే వారు ప్రభుత్వానికి గట్టిగా షాకిచ్చారని తెలిపారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయలేదు.. ఐఆర్ ఇవ్వలేదు.. మూడు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి, ఉద్యోగుల పింఛన్ విధానంపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఉద్యోగులకు ఈ ప్రభుత్వం రూ.26 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. స్వయాన సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యాశాఖలోనే ఓటమి అంటే.. లోకేష్ అసమర్థ పాలనగానే చెప్పుకోవచ్చన్నారు.
కూటమి పాలనలో ఉత్తరాంధ్రపై వివక్ష
కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వివక్ష చూపుతోందని, అమరావతి అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించి, విశాఖకు రూపాయి కూడా కేటాయించలేదన్నారు. రుషికొండ బీచ్‌కి తమ హయాంలో 2020లో బ్లూఫ్లాగ్ హోదా వస్తే, కూటమి ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక ఆ హోదా పోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకెళ్లిందన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు, నర్సీపట్నం, పాడేరు, విజయనగరంలో మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. ఇవన్నీ తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులేనన్నారు. ఇప్పటికై నా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, ముఖ్యనాయకులు మొల్లి అప్పారావు, గండి రవికుమార్, జిల్లా అనుబంధ విభాగ, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment