సమానత్వంతోనే సమాజాభివృద్ధి
సీతమ్మధార : సమానత్వంతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని, మహిళా హక్కులను పోరాడి సాధించుకోవాలని సీఐటీయూ,ఐద్వా, డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆశీలుమెట్ట, లలితా జ్యుయలర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, గురజాడ సెంటర్, సెంట్రల్ పార్కు మీదుగా గాంధీపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు అవకాశాలు ఇస్తే అన్ని రంగాల్లో ముందుకువెళతారన్నారు. నేటికీ చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం దానిని ఆదాయ వనరుగా చూడటం, అదనంగా మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. అంగన్‌వాడీ, ఆశా, ఆర్పీ, హాస్పిటల్, షాప్స్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కుమార్, సీతాలక్ష్మి, వెంకటరెడ్డి, అప్పలరాజు, ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి, సంతోష్, వరలక్ష్మి, కె.మణి, వి.ప్రభావతి, లీలావతి, బొట్టా ఈశ్వరమ్మ, కె. కుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment