● మహిళా చేతన ప్రధాన కార్యదర్శి పద్మ
సీతమ్మధార: మహిళలపై జరుగుతున్న అణచివేత, హింస, దాడులకు వ్యతిరేకంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె.పద్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఇంటా బయటా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం రాజ్యాంగం రూపొందించిన చట్టాలను పాలకులు నీరుగారుస్తున్నారని విమర్శించారు. మణిపూర్‌లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. తల్లి, కుమార్తైపె పోలీసులు రోజులు తరబడి అత్యాచారం చేసిన ఘటన, ప్రేమించినందుకు ఓ యువతిని అడవిలోకి తీసుకెళ్లి తండ్రి హత్య చేసిన ఉదంతం వంటి దారుణాలు ఇటీవల జరిగాయని ఆమె గుర్తు చేశారు. కుల రాజకీయాలు, మతతత్వ దాడుల్లో మహిళలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పోరాడి సాధించుకున్న గృహ హింస, వరకట్న వేధింపుల చట్టాలను కూడా బలహీనపరుస్తున్నారని ఆందోళన చెందారు. ప్రగతి శీల కార్మిక సమాఖ్య నాయకులు అన్నపూర్ణ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న మహిళా హక్కులను నేడు తిరిగి కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చట్టాలను అమలు చేస్తేనే ఇటువంటి ఘటనలు నియంత్రణలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. హెచ్‌ఆర్‌ఎఫ్ ప్రతినిధి కె.అనురాధ, షాంశాద్ బేగం, లావణ్య, భారత నాస్తిక సమాజం జిల్లా కార్యదర్శి వై. నూకరాజు, రాం ప్రభు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment