అడ్డంగా బుకై ్కన అసోసియేషన్ నాయకులు
జగదాంబ: జనతా బజార్‌లో జోనల్ కమిషనర్ పేరుతో జరుగుతున్న వసూళ్ల దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవీఎంసీ జోన్–4 పరిధిలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న జనతా బజార్‌లో అసోసియేషన్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఇరువర్గాల తగాదాలో బయటపడింది. 72 దుకాణాలు కలిగిన ఈ బజారు సముదాయం నుంచి జీవీఎంసీకి రూ.9కోట్లకు పైగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. బకాయిల వసూలుకు జెడ్సీ ఎం.మల్లయ్యనాయుడు బుధవారం సిబ్బందితో బజార్‌కు వచ్చారు. బకాయిలు వెంటనే చెల్లించాలని, లేదంటే దుకాణాలు ఖాళీ చేయాల్సి వస్తుందని వ్యాపారులను హెచ్చరించి వెళ్లారు. ఇది జనతా బజార్ వ్యాపారులకు, అసోసియేషన్ నాయకులకు మధ్య చిచ్చు రేపింది. ‘అద్దె చెల్లింపులకు జోనల్ కమిషనర్ నుంచి సమయం తీసుకువస్తామని నమ్మించి, నెల నెలా జెడ్సీ పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు జెడ్సీ ఎందుకు వచ్చారు.’ అని వ్యాపారులు అసోసియేషన్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో ఒక్కో దుకాణం నుంచి రూ.10వేల చొప్పున రూ.3లక్షల వరకు బలవంతంగా వసూలు చేశారని వ్యాపారులు ఆరోపించారు. వసూలు చేసిన డబ్బుల లెక్కలు తేల్చాలని నిలదీయడంతో తోపులాట జరిగింది. ఈ ఘర్షణతో అసోసియేషన్ నాయకుల గుట్టు రట్టయింది. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ తన పేరుతో డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. జనతా బజార్‌లో వేలం పాటలు లేకుండా అక్రమంగా దుకాణాలను అద్దెలకు ఇస్తున్న వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. కార్పొరేషన్ ఆస్తిని అక్రమంగా అనుభవిస్తూ.. పైగా జోనల్ కమిషనర్ పేరును ఉపయోగించుకుని మోసం చేసిన వారిని వదిలి పెట్టేదిలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment