ఉక్కు పరిరక్షణకు 14న నిరసన
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సొంత గనులు కేటాయించి సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్లతో ఈ నెల 14న అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని విజయవాడలో జరిగిన రాష్ట్ర జేఏసీ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు విశాఖ జిల్లాలో నిరసన ప్రదర్శనలు జయప్రదం చేసేందుకు కార్యాచరణపై సిటూ కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ గురువారం సమావేశమైంది. సమావేశంలో జేఏసీ చైర్మన్ మరడాన జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిన నుంచి ఇప్పటి వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాడుతున్నామన్నారు. కార్మికుల సమస్యలపై మాట్లాడినందుకు యూనియన్ గౌరవ అధ్యక్షుడు అయోధ్యరామ్‌కి షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ నెల 14న జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి నిర్వహించనున్న నిరసన ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిటూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్, ఏపీఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి దేవా, సీఎఫ్‌టీయూఐ జిల్లా కార్యదర్శి లక్ష్మి, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ కుమార మంగళం, శ్రామిక మహిళా కన్వీనర్ పి.మణి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఐజే నాయుడు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.సంతోష్, మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment