ఆ రోజుల్లో.. అండగా.!
సాక్షి, విశాఖపట్నం : మహిళలు రుతుక్రమంలో శుభ్రంగా ఉండటం ఎంతో అవసరం. అందుకు కావాల్సిన ఉత్పత్తులు ఆ సమయానికి అందుబాటులో లేకపోతే.? పనిలో ఉన్నా.. కార్యాలయంలో ఉన్నా.. సినిమా హాల్‌లో ఉన్నా.. అకస్మాత్తుగా పీరియడ్స్ వస్తే..? ఏం చేయాలి. ఎక్కడికి వెళ్లాలి.? ఎలా శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేయాలి.? దీనిపై ఇప్పటికీ మహిళలకు ఎన్నో సందేహాలున్నాయి.
గతంలో ఎదురైన అనుభవాలు ఆమెకు పాఠాలు నేర్పాయి. భవిష్యత్తులో ఆ రోజుల్లో మహిళలు సులువుగా ప్యాడ్స్ పొందేందుకు శానిటరీ న్యాప్‌కిన్స్ వెండింగ్ మెషీన్లు తయారు చేయాలన్న ఆలోచన అంకురించి.. మార్కెట్లోకి తీసుకొచ్చారు బొడ్డేటి ఝాన్సీ రాణి. మహిళల అవసరాలకు అనుగుణంగా వెండింగ్ మెషీన్ల తయారీ సంస్థ ఎన్‌సీకోడ్ వెండింగ్ సిస్టమ్స్ కో ఫౌండర్‌గా వ్యవహరిస్తున్న ఝాన్సీ రాణి.. 2021 నుంచి మహిళలకు అవసరమైన మెషీన్ల తయారు చేస్తూ మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. అధునాతన శానిటరీ న్యాప్‌కిన్ వెండింగ్ మెషీన్లు అందుబాటులోకి తీసుకొచ్చి.. మహిళల్లో రుతుస్రావ సమయంలో అభయమిచ్చేలా రూపొందిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ స్టార్టప్ హబ్ (ఆ హబ్‌లో)లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఉత్తమ నాణ్యత గల శానిటరీ న్యాప్‌కిన్‌లను సులభంగా అందించే ఏర్పాటు చేశారు. నాణెం లేదా టోకెన్లు వేస్తే న్యాప్‌కిన్స్ అందుబాటులోకి వచ్చేస్తాయి. ఏవైనా సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు అండగా నిలిచేలా ఉచితంగా ప్యాడ్స్ పంపిణీ చేయాలంటే.. మెషీన్‌లో ఏర్పాటు చేసిన వ్యవస్థలో ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొడితే.. ప్యాడ్ పొందేలా మెషీన్‌ని రూపొందించామని ఝాన్సీరాణి తెలిపారు. ఈ తరహా మెషీన్లు విద్యా సంస్థల్లోనూ, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటే.. ఆ రోజుల్లో సెలవులు పెట్టే అవసరం ఉండబోదని ధీమాగా చెబుతున్నారు. ఇది మహిళా ఉద్యోగులు, విద్యార్థుల్లో మనోబలాన్ని పెంచుతుందని ఝాన్సీరాణి స్పష్టం చేస్తున్నారు.
మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్స్ వెండింగ్ మెషీన్లు
ప్రధాన కంపెనీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు
ఆ రోజుల్లో.. అండగా.!
ఆ రోజుల్లో.. అండగా.!
Comments
Please login to add a commentAdd a comment