అతివల ఆర్థిక స్వేచ్ఛకు అడుగులు
సాక్షి, విశాఖపట్నం : ఆర్థిక వనరుల నిర్వహణ అబలలకు కొత్తేమీ కాదు. ఇంట్లో మగవారిపై ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మ విశ్వాసం దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటిరాదు. అందుకే ఆర్థిక వ్యవహారాల్లో మహిళలను మించిన ఆర్తికవేత్తలు మరొకరు ఉండరని చెబుతుంటారు. అంతటి శక్తి ఉన్న మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలనే సంకల్పంతో ప్రారంభమైంది ది విశాఖ మహిళా మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆ పరేటివ్ సొసైటీ.
పాతికేళ్ల ప్రస్థానంలో...
నగరానికి చెందిన బి. ప్రసూనాంబ సాధారణ గృహిణి. రైతుబజారుకు వెళ్లిన సమయంలో అక్కడ మహిళా వ్యాపారులు డైలీకలెక్షన్, కాల్‌మనీ వ్యాపారుల నుంచి డబ్బులు అప్పులు తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న వైనాన్ని చూశారు. మహిళలు అప్పుల కోసం ఎందుకు ఇబ్బంది పడాలి.. వారి డబ్బుల్ని వారే పొదుపు చేసి వాడుకునేలా వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని సంకల్పించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ది విశాఖ మహిళా మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆ పరేటివ్ సొసైటీ. సీతమ్మధారలో 10 మంది సభ్యులతో 2020 ఆగస్టులో ప్రారంభమైంది. పాతికేళ్ల ప్రస్థానంలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో 16 శాఖలుగా విస్తరించింది. 816 మంది సభ్యులుండగా.. 10 వేల మంది వరకూ పొదుపు చేసుకునే మహిళలున్నారు. ఇప్పటి వరకూ 2 వేల మంది మహిళలకు రుణాలు మంజూరు చేసి.. వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిందీ సొసైటీ. ఈ మహిళల సొసైటీలో పనిచేసే వారు కూడా మహిళలే కావడం విశేషం. మొత్తం 50 మంది ఉద్యోగులున్నారు. జీవితంలో ఆర్థికంగా, కుటుంబ పరంగా చితికిపోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందీ సొసైటీ. ఉపాధి అవసరమైన వారిని ఎంపిక చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చైర్‌పర్సన్ వైబీ ప్రసూనాంబ చెబుతున్నారు. సొసైటీ తరఫున సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ.. బాలికలకు, మహిళలకూ చేయూతగా నిలుస్తున్నారు.
అతివల ఆర్థిక స్వేచ్ఛకు అడుగులు
Comments
Please login to add a commentAdd a comment