కమనీయం.. అనంతుని కల్యాణం
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి అనంత పద్మనాభ స్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. ముందుగా కుంతీ మాధవ స్వామి ఆలయం వద్ద ధ్వజారోహనం నిర్వహించారు. తదుపరి అనంత పద్మనాభ స్వామిని హనుమంతు వాహనంపైన, శ్రీదేవిని హంస వాహనంపై, భూదేవిని గజ వాహనంపై రాజవీధుల్లోఇ తీసుకు వెళ్లి ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహించారు. అనంత పద్మనాభ స్వామిని తూర్పు వైపున, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను పడమర వైపున ఉంచి ఈ ఎదురు సన్నాహ మహోత్సవం జరిపారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛరణలు, నాద మునీశ్వరుల స్వరాల నడుమ అనంత పద్మనాభ స్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాలైన మద్ది, కృష్ణాపురం, రెడ్డిపల్లి, విలాస్కాన్‌పాలెంల నుంచే కాకుండా దూర ప్రాంతాలైన విజయనగరం, తగరపువలసల నుంచి తరలి వచ్చిన భక్తులు అనంతుని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. ఈవో నానాజీబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, పద్మనాభం సర్పంచ్ తాలాడ పాప, భక్త బృందం సభ్యులు తాలాడ పద్మనాభం, కాళ్ల నగేష్ కుమార్, కంటుబోతు ఎర్నాయుడు, సుంకర నారాయణరావు,తాలాడ పైడిరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment