విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడిలో కొలువైన అమ్మవారికి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా పూజాధికాలు జరిపారు. రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అర్చకులు నేతేటి ప్రశాంత్ అమ్మవారిని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధనలు చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్‌చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు.
రాజీపేట పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు
జియ్యమ్మవలస: మండలంలోని చింతలబెలగాం పంచాయతీ రాజీపేట పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఏనుగులు మంగళవారం దర్శనమిచ్చాయి. ఉదయం వెంకటరాజపురంలోని వరిపంటను ధ్వంసం చేసి సాయంత్రానికి వెంకటరాజపురం, బాసంగి మీదుగా చింతలబెలగాం, రాజీపేట గ్రామంలోకి జారుకున్నాయి. రాత్రి సమయమంలో గ్రామంలోకి చొచ్చుకు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరిపంట, అరటి ఉండడంతో పంటలను ధ్వంసం చేస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విద్యార్థినికి డీఈఓ
అభినందనలు
పాచిపెంట: లక్నోలో ఇటీవల జరిగిన 1500 మీటర్లు, 3వేల మీటర్ల పరుగుపందెంలో పాచిపెంట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని జోత్స్న పాల్గొంది. అండర్ 17 విభాగంలో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థినిని డీఈఓ నాయుడు మంగళవారం అభినందించారు. విద్యార్థినికి పాఠశాల హెచ్‌ఎం ఈశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు అభినందనలు తెలిపారు.
మహిళ మృతిపై కేసు నమోదు
రాజాం సిటీ: పట్టణ పరిధి మల్లికార్జునకాలనీ 7వ లైన్‌లో నివాసం ఉంటున్న కెల్ల లక్ష్మి (44) మృతిచెందడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. వీధిలో దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఇంటి తలుపులు తీయగా ఇంటిలోపల ఆమె మృతదేహం కనిపించిందని ఎస్సై తెలిపారు. మూడు రోజుల క్రితమే ఆమె మృతిచెంది ఉంటుందని, ఇంట్లో ఒక్కతే ఉండేదని, ఆమె కుమారుడు దుర్గాప్రసాద్ విశాఖపట్నంలో ఉంటున్నాడని చెప్పారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
పుష్పాలంకరణలో పైడితల్లి
పుష్పాలంకరణలో పైడితల్లి