
వెంటాడుతున్న వసతి సమస్య..
● నత్తనడకన సాగుతున్న ప్రభుత్వ వైద్యకళాశాల భవనాల నిర్మాణం
● అందుబాటులోకి రాని వసతి ● అవస్థలు పడుతున్న వైద్యులు, విద్యార్థులు
● ప్రభుత్వం మారడంతో పనుల్లో జాప్యం
విజయనగరం ఫోర్ట్:
ప్రభుత్వ వైద్యకళాశాల... విజయనగరం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం. దానిని గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సాకారం చేసింది. గాజులరేగ సమీపంలో 70 ఎకరాల్లో రూ.500 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. మొదటి ఏడాది తరగతులు ప్రారంభించేలా బోధనాస్పత్రి ప్రధాన భవనాన్ని పూర్తిచేసింది. 150 మంది వైద్య విద్యార్థుల బోధనకు వీలుగా తరగతి గదులను సిద్ధం చేసింది. వసతి భవనాల పనులను సైతం చేపట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు పడకేశాయి. బిల్లుల చెల్లింపులో జాప్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కావాలనే వైద్యకళాశాల పనులపై నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాకు మణిహారంగా, ప్రజల వైద్యానికి భరోసాగా నిలిచిన ప్రభుత్వ వైద్యకళాశాల, బోధనాస్పత్రి భవనాల నిర్మాణం నత్త కంటే నెమ్మదిగా సాగుతుండడంపై జిల్లా ప్రజలు మండిపడుతు న్నారు. భవనాల నిర్మాణంలో జాప్యంతో వైద్యులు, విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. వైద్య విద్యార్థులకు రెండో ఏడాది విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్నా భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో నిర్మాణంలో
ఉన్న బోధనాస్పత్రి భవనం
వైద్య కళాశాలపై చిన్న చూపు..!
కూటమి ప్రభుత్వం కావాలనే వైద్య కళాశాలపై చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యులు, వైద్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆహ్లాదకర వాతావరణం, సువిశాల ప్రాంతంలో ఏర్పాటైన వైద్యకళాశాల భవనాల నిర్మాణం పూర్తిచేయడంలో నిర్లక్ష్యం తగదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వైద్య విద్యార్థులకు
తప్పని ఇబ్బందులు
ప్రస్తుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులకు, యంత్ర పరికరాలు అమర్చేందుకు సరిపడా వసతిలేదు. అన్ని విభాగాలకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. గదులు చాలక ప్రొపెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒకే గదుల్లో ఉండాల్సిన పరిస్థితి. విద్యార్థుల బోధనకు, రోగులకు వైద్యసేవలందించేందుకు అవసరమైన యంత్ర పరికరాలు ఏర్పాటుకు గదులు చాలక వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటుతో రోగుల తాకిడి పెరిగింది. ఇన్‌పేషెంట్లకు సేవలందించేందుకు పడకలు చాలక పోవడంతో వరండాలోనే రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకుంది. రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వార్డుల సంఖ్యను పెంచాల్సి ఉంది. వైద్య కళాశాల, సర్వజన ఆస్పత్రి వేర్వేరు చోట్ల ఉండడం వల్ల వైద్యులు ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వైద్యకళాశాల భవనాలన్నీ పూర్తయితే ఇక్కడే సేవలందించేందుకు అవకాశం ఉంటుందని, రోగులకు కూడా మెరుగైన సేవలందుతాయని వైద్యులు చెబుతున్నారు.
వైద్య కళాశాలకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి మధ్య సుమారు 5 కిలోమీటర్ల దూరం. ప్రతిరోజు వైద్య కళాశాల నుంచి వైద్య విద్యార్థులు ప్రాక్టీస్ కోసం ఆస్పత్రికి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. రెండూ ఒకే చోట ఉంటే సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు.

వెంటాడుతున్న వసతి సమస్య..