బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత
పాన్‌గల్: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జీసీఈసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. వారిని చులకనగా చూడకుండా బాలురతో సమానంగా చదివించాలని సూచించారు. జీసీఈసీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ బాక్స్ (ఫిర్యాదుల పెట్టె)ను వినియోగించుకొని సమస్యలను కాగితంపై రాసి బాక్సులో వేయాలన్నారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ రంగంలో తక్కువ కాదని.. నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. బాలికల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ వారికి అండగా నిలవాలని ఎస్‌ఐ శ్రీనివాసులు, డా. చంద్రశేఖర్, ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. సమావేశంలో బాలికల సాధికారత కమిటీ జిల్లా కో–ఆర్డినేటర్, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం కిరణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment