‘కాంగ్రెస్‌కు పనిచేయలేదనే ఆధారాలు చూపిస్తావా?’
వనపర్తిటౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ గెలుపునకు పనిచేయలేదని ఎమ్మెల్యే మేఘారెడ్డి పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆధారాలుంటే బయట పెట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన్నె జీవన్‌రెడ్డితో రూ.90 కోట్లు ఖర్చు చేయించి ఆ డబ్బుతో వనపర్తి పుర పీఠం దక్కించుకొని గొప్పపని చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అసంపూర్తి పనుల విషయమై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో మాట్లాడానని.. నియోజకవర్గ అభివృద్ధికి ఎవరి కాళ్లు మొక్కేందుకై నా తాను వెనుకాడనని స్పష్టం చేశారు. అభివృద్ధి ముసుగులో అవినీతి జరగొద్దని.. ఓ వ్యక్తి కోసం మండల కేంద్రం కాకుండా వేరే ప్రాంతంలో శంకుస్థాపన చేస్తున్నందుకే అడ్డుకున్నట్లు చెప్పారు. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో కన్నతల్లిలాంటి పార్టీకి ఏనాడు తప్పు, చెడు చేయలేదని.. మేఘారెడ్డి నాలుగేళ్లయితే మరో పార్టీలోకి వెళ్లరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. దేశస్థాయిలో తనకు నిజాయితీపరుడనే పేరుందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను తెలంగాణ ఏకే అంటోనీగా పిలుస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అధికారిక వాహనంలో రాకుండా సాధారణ కారులో ఎమ్మెల్యే ఎందుకు తీసుకొచ్చారో, మంత్రి ఎలా వచ్చారో అర్థం కాలేదన్నారు. విద్యార్థి దశ నుంచి ఏఐసీసీ స్థాయికి వరకు ఎదిగిన మేం టిష్యూ పేపర్‌లా కనబడుతున్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత, కొత్త 80, 20 శాతంలో ఉంటేనే పార్టీ బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులకు విఘాతం
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కోడ్లుగా విభజించి ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకు పూనుకుందని.. పారిశ్రామికవేత్తలకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకే కోడ్లను తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నారని.. 12 గంటలు పని చేయాల్సి వస్తుందన్నారు. కోడ్లను అమలు చేస్తే కార్మికులు సమ్మె చేసే హక్కు కోల్పోతారని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సంఘాల్లో అధికసంఖ్యలో కార్మికులను చేర్చి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మోషా, శ్రీహరి, శ్రీరామ్, గోపాలకృష్ణ, శ్యాంసుందర్, లక్ష్మమ్మ, భరత్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలానికి
ప్రత్యేక బస్సులు
వనపర్తి టౌన్: మహా శివరాత్రిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాల నుంచి శ్రీశైలానికి వెళ్లే భక్తులు, ప్రజల సౌకర్యార్థం సోమవారం వనపర్తి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
నేడు మార్కెట్‌లో
లావాదేవీలు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయి. శని, ఆదివారాలు సెలవుల కారణంగా రెండు రోజులపాటు మార్కెట్‌లో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ టెండర్ల ద్వారా రైతులు తెచ్చిన ధాన్యానికి ధరలు నిర్ణయిస్తారు.
‘కాంగ్రెస్‌కు పనిచేయలేదనే ఆధారాలు చూపిస్తావా?’
Comments
Please login to add a commentAdd a comment