పన్ను వసూలుపై దృష్టి సారించని అధికారులు
పుర ఆదాయానికి గండి
ఏళ్లుగా కొనసాగుతున్న తంతు
వనపర్తిటౌన్: జిల్లాలోని పురపాలికల్లో ఎక్కడ చూసినా భారీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పండుగలు, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, రాష్ట్ర, స్థానిక నాయకుల పుట్టిన రోజులు, ముఖ్య నాయకులు, మంత్రులు రాక సమయం.. ఇలా ఒక్కటేమిటి ప్రతి వాటికి అధికార, ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు పుర అనుమతి తీసుకోవాల్సి ఉండగా అవేమీ పట్టించుకోవడం లేదు. జిల్లాకేంద్రంలో పదేళ్లకుపైగా ఇదే తంతు యథేచ్ఛగా కొనసాగుతోంది. అప్పటి కలెక్టర్ శ్వేతామహంతి ఫ్లెక్సీల ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేయడంతో నెలరోజుల పాటు హడివుడి చేసిన పుర అధికారులు ఆ తర్వాత వాటి గురించి పట్టించుకున్న పాపానపోలేదు.
వాస్తవానికి ఫ్లెక్సీల ఏర్పాటుకు పుర అనుమతి తీసుకోవడంతో పాటు నిర్దేశించిన రోజులకు రుసుం కూడా చెల్లించి అధికారులు సూచించిన ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ఆదాయాన్ని పుర అభివృద్ధికి వెచ్చించాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ పుర అధికారులు రాజకీయ నాయకుల చేతిలో బందీ కావడంతో ఫ్లెక్సీల ఏర్పాటుకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్దేశిత రుసుం నిర్ణయించి టెండర్ నిర్వహించాలి.. టెండర్‌దారుడు ఆ నగదును ఒకేసారి పురపాలికకు చెల్లించి కేటాయించిన గడువులోగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు రుసుం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారి నుంచి వసూలు చేయాలి. లేదా పుర సిబ్బంది నగదు వసూలు చేసి రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పురపాలికల్లో వర్తించడం లేదు. పుర అధికారులు సైతం ఏనాడు రాజకీయ నాయకులను ప్రశ్నించేందుకు సాహసించడం లేదు. ప్రతి ఏటా ఆస్తి, ట్రేడ్ లైసెన్స్, కొళాయి పన్ను వసూళ్లపై దృష్టి సారిస్తున్న అధికారులు ప్రచార ఆదాయంపై శ్రద్ధ చూపడం లేదు. దీంతో రూ.లక్షల ఆదాయం పురపాలికలు కోల్పోతున్నాయి.
అలాగే రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు నెలల తరబడి అలాగే ఉండటంతో రహదారుల ఎదురుగా ఉండే దుకాణదారులు, వాహనాల పార్కింగ్‌కు అసౌకర్యం కలుగుతోంది. అంతేగాకుండా పుర అభివృద్ధికి దోహదపడాల్సిన ప్రజాధనం దుర్వినియోగం పాలవుతోంది. ఏ పార్టీ పాలకవర్గం కొలువుదీరినా ఫ్లెక్సీల ఏర్పాటుకు పాటించాల్సిన నిబంధనలపై ఆలోచించినట్లు కనిపించలేదు. అధికారులు సైతం ఆ దిశగా కార్యాచరణ చేపట్టిన దాఖలలు ఒక్కటంటే ఒక్కటి లేదు. జిల్లాకేంద్రంలో ప్రధాన చౌరస్తాలైన రాజీవ్‌చౌక్, అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, కొత్తబస్టాండ్, పాతబజార్, బస్‌డిపో రోడ్డు, కొత్తకోట రహదారి, ఇందిరాపార్కు, శఽంకర్‌గంజ్ తదితర ప్రదేశాల్లో ఫ్లెక్సీలు అధికంగా ఉంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment