వనపర్తి: వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోమారు భగ్గుమంది. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు శనివారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలోనే ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విభేదించుకోవడంతో మరోమారు ఆధిపత్య పోరు బహిర్గతమైంది. జిల్లాలో మంత్రుల పర్యటన షెడ్యూల్ ఖరారుగాకముందే ఇద్దరు నేతల చర్చించుకొని సమష్టిగా ముందుకు సాగాల్సింది పోయి.. ఓ వైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ మరోవైపు విమర్శలు గుప్పించుకోవడం శోచనీయం. ఎమ్మెల్యే తన అనుచరుడి కోసం అభివృద్ధి పనులు చేపడుతున్నారంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేయడం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలతో చిన్నారెడ్డి సఖ్యత పెంచుకున్నారని, తరుచూ ఫోన్లలో మాట్లాడుతూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఎమ్మెల్యే బహిరంగంగా విమర్శలు గుప్పించడం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.
అధిష్టానం జోక్యం చేసుకోకుంటే కష్టమే..
కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోకుంటే సమీప భవిష్యత్‌లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ కోణంలో ఆ ఇద్దరు నేతలు ఆలోచించడం లేదనే వాదన పార్టీ క్యాడర్‌లో వినిపిస్తోంది. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో తనకున్న సంబంధాల విషయాన్ని ఎమ్మెల్యే తరచూ చేస్తుండటంతో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఖండించారు. శనివారం నాటి ఘటనతో వనపర్తి కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉన్నాయనేది స్పష్టమైంది.
ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం ఫోన్?
శనివారం నాటి మంత్రుల పర్యటనలో చోటు చేసుకున్న ఘటనపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే మేఘారెడ్డిని హైదరాబాద్‌కు పిలిపించి ఆరా తీసినట్లు సమాచారం. అదేరోజు రాత్రి ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన వెళ్లి ఇక్కడ చోటు చేసుకున్న ఘటనల వివరాలను నివేదించినట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నారు.
విమర్శలకు ఆస్కారం..
అధికారపార్టీలోని వర్గ విభేదాలు ప్రతిపక్షాలకు విమర్శించే అస్త్రాలను చేతికందించినట్లయింది. శనివారం నాటి ఘటనపై బీఆర్‌ఎస్ నేతలు సామాజిక మాధ్యమాలే వేదికగా అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిని అసరాగా చేసుకొని ప్రతిపక్ష నాయకులు అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు పెంచేలా పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఈ విషయాన్ని ప్రధాన నేతలు గుర్తించడం లేదన్న భావన కాంగ్రెస్ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో కాంగ్రెస్‌లోనే స్వపక్ష, విపక్షాల ధోరణి కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment