భీమా.. రైతులకేదీ ధీమా!
పిచ్చి మొక్కలు, పూడికతో నిండిన కాల్వలు
●
చుక్క నీరు రావడం లేదు..
భీమా కాల్వ గ్రామం మీదుగా వెళ్తున్నా చుక్క సాగునీరు అందడం లేదు. కాల్వ కింద పది ఎకరాల పొలం ఉన్నా పంటలు సాగుచేసే అవకాశం లేదు. తప్పని పరిస్థితుల్లో వర్షాధార పంటలు సాగు చేస్తున్నా. భీమా అధికారుల పర్యవేక్షణ లేకనే కాల్వ పూడుకుపోతోంది.
– దేవర్ల జమ్ములు, ధర్మాపురం (అమరచింత)
ముళ్లపొదలు పెరగడంతో..
కాల్వ గ్రామం మీదుగా వెళ్తుండటంతో సాగునీరు అందుతుందని సంబరపడ్డాం. కాల్వ మాత్రం తవ్వించారే తప్పా సాగునీరు అందడం లేదు. ఎప్పుడో తవ్విన కాల్వలు పూడుకుపోతున్నాయి. ముళ్లపొదలు ఏపుగా పెరుగుతుండటంతో శిథిలావస్థకు చేరుతున్నాయి.
– దేవర్ల మాసన్న, ధర్మాపురం (అమరచింత)
పూడికతీతకు ప్రతిపాదనలు..
భీమా, సంగంబండ కాల్వల్లో పూడికతీత కూలీలతో సాధ్యం కావడం లేదు. పాంరెడ్డిపల్లి, నాగల్‌కడ్మూర్ ప్రాంతాల్లో కాల్వ లోతుగా ఉన్న ప్రదేశాల్లో పూడికతీతకు సుమారు రూ.20 లక్షలు అవసరమని ఉన్నతాధికారులకు గతేడాది ప్రతిపాదనలు పంపించాం. కొన్నిచోట్ల ఎంపీడీఓల సహకారంతో ఉపాధి కూలీలతో పూడిక తొలగింపు పనులు చేపడుతన్నాం.
– సతీశ్, డీఈఈ, భీమా ప్రాజెక్టు
అమరచింత: మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత, ఆత్మకూర్, నర్వ, మక్తల్, మాగనూర్ మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎనిమిదేళ్ల కిందట భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ప్రత్యేకంగా సుమారు 32.50 కిలోమీటర్ల మేర భీమా కాల్వ నిర్మించారు. ఈ కాల్వ నీటితో ఆయా మండలాల్లోని చెరువులు నీటితో నింపడం, పిల్ల కాల్వల ద్వారా పంటలకు సాగునీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం కాల్వల్లో పిచ్చి మొక్కలు, పూడిక నిండి నీరు ముందుకు పారని పరిస్థితి నెలకొంది. రైతులు తమకుతాముగా వీటిని తొలగించాలని ప్రయత్నాలు చేసినా భారీ వృక్షాలు, ముళ్లపొదలు ఉండటంతో సాధ్యం కావడం లేదు. తమ బాధలను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
24 వేల ఎకరాల ఆయకట్టు..
భీమా కాల్వ నీటితో నియోజకవర్గంలోని సుమారు 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రణాళిక సిద్ధం చేసి అందుకు అనుగుణంగానే కాల్వలు నిర్మించారు. కాల్వ నిర్మాణంతో పాటు వెనువెంటనే లైనింగ్ పనులు సైతం పూర్తి చేయడంతో మొదట్లో సాగునీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారింది. అనంతరం నిర్వహణ కొరవడటంతో మూడేళ్ల కాలంలోనే కాల్వల్లో జమ్ము గడ్డి, ముళ్లపొదలు, పూడిక పేరుకుపోయింది. దీంతో ప్రస్తుతం 10 వేల ఎకరాలకు సైతం నీరందని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలో 32.50 కిలోమీటర్ల కాల్వ..
24 చెరువులు, 25 వేల ఎకరాల ఆయకట్టు
ముందుకు పారని సాగునీరు
ఆందోళనలో అన్నదాతలు
భీమా.. రైతులకేదీ ధీమా!
భీమా.. రైతులకేదీ ధీమా!
భీమా.. రైతులకేదీ ధీమా!
Comments
Please login to add a commentAdd a comment