బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు
ప్రజావాణి ఫిర్యాదులు
పరిష్కరించాలి..
ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి 66 వినతులు వచ్చాయని.. పరిశీలించి సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులకు పంపినట్లు వివరించారు. పెండింగ్, సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వనపర్తి: జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత, బాలికల సంరక్షణపై జనవరి 22 నుంచి మార్చి 8 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1098కి సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులతో పాటు పెళ్లికి సహకరించిన వారు, పెళ్లి చేసే అర్చకుడు, ఖాజీ, పాస్టర్‌పై కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 888 మంది మహిళలు మాత్రమే ఉన్నారని.. ఈ అంతరాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలని లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులను ఆదేశించారు. అమ్మాయిల్లో రక్తహీనతను పారద్రోలేందుకు వైద్యశాఖ, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సరైన ఎదుగుదల లేని పిల్లలను ఎన్‌ఆర్‌సీ కేంద్రాలకు పంపించాలని ఆదేశించారు.
సుకన్య సమృద్ధి యోజన..
అమ్మాయిల చదువులు, పెళ్లిళ్ల కోసం కేంద్రం సుకన్య సమృద్ధి యోజనను తీసుకొచ్చిందన్నారు. తల్లిదండ్రులు ఈ పథకంలో చేరి ప్రతి నెల కొంత మొత్తం జమ చేస్తే బాలికకు యుక్త వయస్సు వచ్చే నాటికి ఏటా 8.6 శాతం వడ్డీ కలిపి చెల్లిస్తారని వివరించారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు నాంది పలకాలని కోరారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో ప్రచార గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీసీపీఓ రాంబాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment