పోలీసు సేవల్ని వినియోగించుకోవాలి
వనపర్తి: పోలీసు ప్రజావాణికి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదుగురి నుంచి అర్జీలను స్వీకరించి సంబంధిత స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య తీవ్రత, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేలా ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ పని చేస్తుందని వివరించారు. ఎలాంటి శబ్ధ కాలుష్యం లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్ర నిర్వహించినందుకు సోమవారం హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు అరుణ్, పట్టణ అధ్యక్షుడు నందు, యువకులను ఎస్పీ రావుల గిరిధర్ అభినందించారు. ఇక ముందు వినాయక నిమజ్జనాల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, చెక్కభజన, కోలాటం వంటి వాటిని ప్రోత్సహించాలని సూచించారు. సమావేశం అనంతరం ఎస్పీని యువకులు అరుణ్, నందు, మల్లికార్జున్, అఖిల్, దివాకర్ శాలువాతో సన్మానించారు.
ఐక్యతతో వేడుకలు జరుపుకోవాలి..
పాన్‌గల్: గ్రామాల్లో వేడుకలను ఐకమత్యంతో కలిసిమెలసి జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. సోమవారం మండలంలోని దావాజిపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఏర్పాటు చేయించిన శివపార్వతుల విగ్రహాలను ఆయన ఆవిష్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సెంట్రల్ లాక్‌లను పరిశీలించి వాటిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు తోడ్పాటునందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాసులు, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment