మహిళలంటే చిన్నచూపు వద్దు
వనపర్తి: మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని.. తల్లిదండ్రులు ఆడపిల్ల అనే చిన్నచూపు చూడకుండా మగ పిల్లలతో సమానంగా స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు చదివించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం బేటీ బచావో–బేటీ పడావో వారోత్సవాల్లో భాగంగా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలు, మహిళా పోలీసు సిబ్బందితో జిల్లాకేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిరాదరణకు గురైన బాధిత మహిళలు, బాలికలు మౌనం వీడి నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలన్నారు. మహిళ చదువుకుంటే తన పిల్లలకు సమాజంపై అవగాహనే కల్పించే అవకాశం ఉంటుందని.. సమాజంలో జరుగుతున్న మంచి, చెడుపై ఎప్పటికప్పుడు తమ పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఉండాలని కోరారు. ఆపద వస్తే ఎలా ఎదుర్కోవాలి.. ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశాలపై మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలని సూచించారు. బాలికలు, మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా, బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినా టోల్‌ఫ్రీ నంబర్ 1098, డయల్ 100కు, సమీపంలోని పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని.. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణా, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, మహిళ, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి సుధారాణి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాంబాబు, రూరల్ డెవప్‌మెంట్ సొసైటీ చైర్మన్ చిన్నమ్మ థామస్, సూపరింటెండెంట్ అరుంధతి, సీనియర్ అసిస్టెంట్ అప్సర్, డిస్ట్రిక్ట్ మిషన్ కో–ఆర్డినేటర్ భాస్కర్, జండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి, పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అడ్డంకులు, కష్టాలు, అసమానతలను అధిగమిస్తూ ముందుకుసాగాలి
ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment