
నిధుల గోల్‌మాల్..!
వనపర్తి: జిల్లాలోని బీసీ అభివృద్ధిశాఖ కార్యాలయంలో ఓ అధికారి అధికారిక బ్యాంకు ఖాతా నుంచి ఇష్టానుసారంగా నిధులు డ్రా చేసిన ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై పీడీఎస్‌యూ, బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారులకు వేర్వేరుగా ఫిర్యాదులు అందించడంతో పాటు మీడియాతో వెల్లడించారు. ఫిర్యాదుకు ఏకంగా కార్యాలయ సిబ్బంది పేర్లతో అధికారిక బ్యాంకు ఖాతా నుండి నగదు ఉపసంహరించిన జాబితాను జతపర్చారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో వైద్య కళాశాల ప్రారంభమైన సమయంలో విద్యార్థినుల వసతిగృహం కోసం అప్పటికే బీసీ సంక్షేమశాఖ నిర్మించిన ఓ భవనాన్ని నెలకు రూ.50,030 అద్దె చొప్పున అప్పటి కలెక్టర్ కేటాయించారు. నెలవారీ అద్దె ఆ శాఖ అధికారిక బ్యాంకు ఖాతాలో జమ అవుతూ వస్తోంది. నిబంధనల మేరకు అద్దెను బీసీ సంక్షేమశాఖ రాష్ట్రశాఖకు పంపించాల్సి ఉన్నా.. కార్యాలయంలో సౌకర్యాలు కల్పించుకోవాలనే సాకు చూపి విడతల వారీగా భారీ మొత్తంలో నగదు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. డ్రా చేసిన సమయంలో చెక్కులపై కొన్నిచోట్ల సెల్ఫ్ అని, మరికొన్ని కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పేర్లతో డ్రా చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై గత కొన్నిరోజులుగా విచారణ కొనసాగుతోంది.
ఉద్యోగ నియామకాల్లోనూ..
జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఇటీవల చేసిన తాత్కాలిక సిబ్బంది నియామకాల్లోనూ ఆ అధికారి నిబంధనను గాలికొదిలి ఇష్టానుసారంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు ఆర్థిక, ఇతర ప్రయోజనాలు చేకూర్చిన వారిని ఎలాంటి నిబంధనలు పాటించకుండా నియమించినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామకాలపై కూడా అదనపు కలెక్టర్, ఆర్డీఓ వేర్వేరుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.
బీసీ అభివృద్ధిశాఖ కార్యాలయంలో ఓ అధికారి చేతివాటం?
కిందిస్థాయి ఉద్యోగుల పేరిట నగదు ఉపసంహరణలు
వెల్లువెత్తిన ఫిర్యాదులు..
కొనసాగుతున్న విచారణ
విచారణ కొనసాగుతోంది..
కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించాం. 2023లో కార్యాలయ సిబ్బంది పేర్లతో బ్యాంకు నుంచి నగదు ఉపసంహరించినట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. బ్యాంకు నుంచి వివరాలు సేకరించి రెండేళ్ల లావాదేవీలను పరిశీలిస్తున్నాం. కార్యాలయ సిబ్బంది పేర్లతో డబ్బులు ఎందుకు డ్రా చేయాల్సి వచ్చిందనే అంశాన్ని తెలుసుకోవాల్సి ఉంది. విచారణ త్వరగా పూర్తిచేసి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం.
– జి.వెంకటేశ్వర్లు,
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వనపర్తి
వడ్డీ డబ్బులేవి..?
బీసీ అభివృద్ధి రాష్ట్రశాఖ నుంచి జిల్లాకు వివిధ పద్దుల కింద కేటాయించిన నిధులు నెలల పాటు ఖర్చు చేయకపోవడంతో బ్యాంకు ఇచ్చిన వడ్డీ రూ.లక్షల్లో జమ అయింది. వడ్డీ డబ్బులను ఎలాంటి అవసరాలకు వినియోగించరాదని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. వాటిని పక్కనబెట్టి కార్యాలయ అవసరాల పేరుతో విత్‌డ్రా చేసినట్లు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా అంశాలపై కొన్నాళ్లుగా విచారణ కొనసాగుతుండగా.. తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. సిబ్బంది పేరున చెక్కులు రాసి డబ్బులు డ్రా చేయడంతో అందరూ చిక్కుల్లో పడ్డారు. విచారణలో తమకు సంబంధం లేదంటూ సిబ్బంది లబోదిబోమన్నట్లు ప్రచారం సాగుతోంది.

నిధుల గోల్‌మాల్..!
Comments
Please login to add a commentAdd a comment