
ముగిసిన చెరుకు కోతలు
కృష్ణవేణి చక్కర ఫ్యాక్టరీ పరిధిలో 2.65 లక్షల టన్నులు
●
యాజమాన్యం దృష్టికి
సమస్యలు..
చెరుకు రైతుల సమస్యలను ఎప్పటికప్పడు కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాం. పంట తరలించిన 15 రోజుల్లోపూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని విన్నవించాం. సమయం దాటితే 16 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని కోరాం. సకాలంలో కోత కార్మికులు, యంత్రాలు రప్పించాలని సూచించాం.
– జీఎస్ గోపి,
రాష్ట్ర అధ్యక్షుడు, చెరుకు రైతు సంఘం
సకాలంలో కోతలు..
రెండేళ్లుగా సకాలంలో చెరుకు కోతలు పూర్తవుతున్నాయి. గతంలో వేసవి పూర్తయినా కోతలు పూర్తిగాకపోయేవి. కోత కార్మికుల కొరత కారణంగా జాప్యం జరిగేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. అప్పట్లో పండించిన చెరుకును ఫ్యాక్టరీకి తరలించేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి.
– మునెప్ప, మస్తీపురం, అమరచింత
అమరచింత: జిల్లాలోని కృష్ణవేణి చక్కర ఫ్యాక్టరీ పరిధిలో గతేడాది నవంబర్ 20న ప్రారంభమైన చెరుకు కోతలు ఫిబ్రవరి 19తో ముగిశాయి. మొత్తం 4.20 లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడించి ఈ సీజన్ లక్ష్యాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం చేరుకోగలిగింది. గతంలో కోత కార్మికులు అందుబాటులో లేకపోవడంతో కోతలు సకాలంలో పూర్తిగాక ఇటు రైతులు, అటు యాజమాన్యానికి ఇబ్బందులు ఎదురయ్యేవి. రెండేళ్లుగా యాజమాన్యం ముందుస్తుగా కోత కార్మికులతో పాటు యంత్రాలను రప్పించడంతో ఎలాంటి సమస్యలు లేకుండా అనుకున్న సమయానికి కోతలు పూర్తి చేయగలుగుతున్నారు. ఈ ఏడాది మహాఽరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి 120 కోత కార్మిక బృందాలు, 8 యంత్రాలను వినియోగించినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం వెల్లడించింది. కోత లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు జహీరాబాద్ నుంచి 1.65 లక్షల టన్నుల చెరుకును దిగుమతి చేసుకొని గానుగా ఆడించామని వివరించారు.
పదెకరాల్లో సాగు చేశా..
నేను పది ఎకరాల్లో చెరుకు సాగు చేశా. ఈ సారి 350 టన్నుల దిగుబడి రాగా ఫ్యాక్టరీకి సకాలంలో తరలించా. గతంలో చెరుకు తోట కోతకు సిద్ధంగా ఉందని ఫ్యాక్టరీ యాజమాన్యానికి విన్నవించినా కోత కూలీలు సకాలంలో రాకపోయేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కోత కార్మికులను ముందస్తుగానే గ్రామానికి పంపడంతో సకాలంలో కోతలు పూర్తి చేయగలిగాను.
– దోసు హన్మంతు,
మస్తీపురం, అమరచింత
టన్నుకు రూ.3,366.80 చొప్పున..
చెరుకును ఫ్యాక్టరీకి తరలించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.75 కోట్లు జమ చేయగా.. రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ సీజన్‌లో టన్నుకు రూ.3,366.80 చొప్పున ధర చెల్లించినట్లు డీజీఎం వెల్లడించారు. నాలుగు నెలల్లో కోతలు పూర్తిచేసి సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. కంపెనీ పరిధిలో సాగు విస్తీర్ణం తగ్గుతున్నందున రైతులకు రాయితీలు ప్రకటించడంతో ఈసారి 6 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుల బకాయిల చెల్లింపులు ఈ నెల రెండో వారంలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
పూర్తిస్థాయిలో చెల్లింపులు..
ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో సకాలంలో డబ్బులు చెల్లించేలా యాజమాన్యం ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు రూ.75 కోట్లు చెల్లించగా.. బకాయి ఉన్న మరో రూ.20 కోట్లు రెండవ వారంలోగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు సాగు విస్తీర్ణం 9 వేలకు పెంచేందుకు కృషి చేస్తున్నాం.
– మురళి, డీజీఎం, కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ
సాగు విస్తీర్ణం పెంపునకు..
ఫ్యాక్టరీ ప్రారంభంలో రైతులు చెరుకు సాగుపై దృష్టి సారించారు. అప్పట్లో సకాలంలో కోత కార్మికులు రాకపోవడం, యాజమాన్యం డబ్బులను సకాలంలో చెల్లించకపోవడంతో 8,500 ఎకరాల విస్తీర్ణం కాస్త 4,500కు పడిపోయింది. దీంతో రెండేళ్లుగా ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు సిబ్బంది సాగు పెంపుపై దృష్టిసారించి రైతులకు రాయితీలు ప్రకటించడంతో ప్రస్తుతం సాగు విస్తీర్ణం ఆరు వేలకు పెరిగింది. రాయితీపై విత్తనాలు, కౌలు రైతులకు రాయితీలు, గ్రామాల్లో చెరుకు సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తుండటంతో రైతులు సాగుకు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు.
గానుగ ఆడింది 4.20 లక్షల టన్నులు
జహీరాబాద్ నుంచి 1.65 లక్షలు దిగుమతి
రైతులకు చెల్లింపులు రూ.75 కోట్లు.. బకాయిలు రూ.20 కోట్లు
వచ్చే సీజన్‌లో సాగు విస్తీర్ణం 9 వేల ఎకరాలకు పెంచే యోచన
రాయితీలు ఇలా..
రైతులకు చెరుకు సాగుపై ఆసక్తి పెంపొందించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం అనేక రాయితీలు ప్రకటిస్తుంది. ప్రతి ఏటా అక్టోబర్ 20 నుంచి జనవరి 20 వరకు చెరుకు ప్లాంటేషన్ చేసే రైతులకు దిగుబడిపై టన్నుకు అదనంగా రూ.350 బోనస్ అందించనుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌లో సాగుచేసిన రైతులకు టన్నుకు రూ.300 చొప్పున చెల్లించనుంది. రెండోసారి పంట కోత సమయంలో రూ.300, నాలుగు, ఐదు కోతల్లో రూ.500 చొప్పున చెల్లిస్తోంది. అలాగే కొత్తగా చెరుకు సాగు చేసే రైతులకు 1.20 ఎకరాల సాగుకు రెండున్నర టన్నుల చెరుకు విత్తనాన్ని రాయితీపై అందిస్తోంది. అదేవిధంగా డ్రిప్ కొనుగోలుకు రూ.20 వేల వరకు రుణం ఇస్తోంది.

ముగిసిన చెరుకు కోతలు

ముగిసిన చెరుకు కోతలు

ముగిసిన చెరుకు కోతలు
Comments
Please login to add a commentAdd a comment