అడ్డంకులు దాటుతూ.. | - | Sakshi
Sakshi News home page

అడ్డంకులు దాటుతూ..

Published Sat, Mar 1 2025 7:32 AM | Last Updated on Sat, Mar 1 2025 7:32 AM

అడ్డం

అడ్డంకులు దాటుతూ..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఏడోరోజు కొనసాగిన సహాయక చర్యలు

అచ్చంపేట: దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్యాస్‌ కటింగ్‌ పరికరంతో టీబీఎం మిషన్‌ కట్‌ చేసే పనులు వేగవంతమయ్యాయి. తొలగించిన భాగాలను ఎప్పటికప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. శుక్రవారం ఏడోరోజు లోకో ట్రైన్‌కు సింగిరేణి బొగ్గు గనుల నుంచి తెప్పించిన పెద్ద సైజు ట్రేలను బిగించి గ్యాస్‌, ఫాస్మ కటర్ల ద్వారా తొలగించిన టీబీఎం విడి భాగాలు, ఇతర ఇనుప రాడ్లు, పైపులను రెస్క్యూ టీం సభ్యులు మోయగలిగిన సైజులో కట్‌ చేసి సొరంగం బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కన్వేయర్‌ బెల్ట్‌ను పునరుద్ధరించలేదు. సొరంగం లోపల 14.85 కిలోమీటర్ల వద్ద టీబీఎం మిషన్‌ ఉండగా పైకప్పు కూలింది. ఇక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు లోకో ట్రైన్‌ను 13.500 కిలోమీటరు వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గట్టి పడిన మట్టిని తీయడానికి మినీ పొక్లెయిన్లను వినియోగిస్తున్నారు. పొక్లెయిన్లు, బృందాలు లోపలి బురదను తొలగిస్తూ బయటికి పంపిస్తున్నారు. మూడు బోగీలు (ట్రేలు) ద్వారా బురద బయటికి తరలించారు. సొరంగంలోకి చేరిన నీటిని బయటకు పంపింగ్‌ చేయడానికి అదనపు మోటార్లను తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో మట్టిని తరలించకపోయినా లోపల ఓ పక్కకు వేస్తూ కార్మికుల ఆచూకీ కనుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాధితుల కోసం సొరంగంలో టెషర్స్‌ అందుబాటులో ఉంచారు.

రక్షణ కోసం..

టన్నెల్‌లోకి వెళ్లే సహాయక బృందాల రక్షణ కోసం కృత్రిమ ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐరన్‌ షీట్లు, పైపులను రౌండ్‌గా బెండ్‌ చేసి వెల్డింగ్‌ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తున్నారు. దీని ద్వారా లోపలికి ప్రవేశించేలా చర్యలు చేపట్టారు. సొరంగం కూలిన, రాళ్లు, రప్పలు ఊడిపడినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా వీటిని తయారు చేసున్నారు. దీంతో ఏమైనా ప్రమాదం జరిగినా తప్పించుకునే అవకాశం ఉంటుందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ టన్నెల్‌ వద్దకు ఇతరులు వెళ్లకుండా నివారిస్తున్నారు.

ముమ్మరంగా బురద,

మట్టి, శిథిలాల తరలింపు

అత్యాధునిక పరికరాలతో

గాలింపు

సొంతూళ్లకు కార్మికులు..

టన్నెల్‌లో జరిగిన ప్రమాదంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కొక్కరుగా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కుటుంబసభ్యులు ఫోన్‌ చేసి తిరిగి రావాలని వేడుకుంటున్నారని, గత్యంతరం లేక మూడు నెలల జీతాలు రావాల్సి ఉన్నా వదిలి వెళ్తున్నామని కార్మికులు వాపోయారు. సొరంగం వద్ద పనులు సాగుతాయో లేదో అని.. తమ సొంత రాష్ట్రంలోనే ఏదో ఒక పని చేసుకుంటామని పేర్కొంటున్నారు. జీతాలు లేకున్నా సరే మా ప్రాణాలే ముఖ్యం అంటున్నారు.

టన్నెల్‌ వద్ద కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, విపత్తుల విభాగం ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అడ్డంకులు దాటుతూ.. 1
1/1

అడ్డంకులు దాటుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement