
ఇంటర్ పరీక్షలకు పటిష్ట చర్యలు
వనపర్తి: మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ శాంతికుమారి ఇంటర్ పరీక్షలు, ఎల్‌ఆర్‌ఎస్ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది 12,150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని.. నిర్వహణకు 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఇన్విజిలేటర్లకు శిక్షణ సైతం పూర్తి చేశామని.. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు, పరీక్ష సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. కేంద్రాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు అందుబాటులో ఉంచాలని పుర, పంచాయతీ అధికారులను ఆదేశించామని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఐఈఓ అంజయ్య, డీపీఓ కృష్ణ పాల్గొన్నారు.
పరీక్షలు సక్రమంగా జరిగేలా చూడాలి..
వనపర్తి విద్యావిభాగం: త్వరలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలు సక్రమంగా జరిగేలా చూడాలని ఇంటర్‌బోర్డ్ పరిశీలకుడు విశ్వేశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. వార్షిక పరీక్షల నిర్వహణ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీఐఈఓ ఎర్ర అంజయ్య వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వివరించారు. సమావేశానికి 25 కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, బఫర్ స్టాఫ్ హాజరయ్యారు.
రామన్‌పాడులో
నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఎన్టీఆర్ కాల్వకు 940 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 24 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 862 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment