
నేడు జిల్లాకు సీఎం రాక
వనపర్తి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకుగాను అధికార, పాలకవర్గం భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4:35 వరకు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. హెలీకాప్టర్‌లో హైదరాబాద్ నుంచి 11.30కి జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని స్వామి వారి దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి రూ.కోటి ప్రొసీడింగ్ పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ అయ్యలూరి రఘునాథశర్మకు అందజేస్తారు. అటు నుంచి తను విద్యనభ్యసించిన జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకొని అక్కడే పాఠశాల, కళాశాల భవన నిర్మాణాలు, జీజీహెచ్ భవనం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐటీ టవర్, శ్రీరంగాపురం ఆలయ అభివృద్ధి పనులు, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవనం, జిల్లాకేంద్రంలోని రాజనగరం శివారు నుంచి పెద్దమందడి వరకు బీటీరోడ్డు నిర్మాణం, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ బిల్డింగ్, నియోజకవర్గంలోని సీఆర్‌ఆర్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని తన పాఠశాల, కళాశాల మిత్రులు, గురువులతో కాసేపు గడిపి వారితో కలిసి భోజనం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20కి బయలుదేరి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే రేవంతన్న కా భరోసా అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, కుట్టుమిషన్లు, నియామక పత్రాలు అందజేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు హెలీకాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారు.
బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జోగుళాంబ డీఐజీ..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ నుంచి జెడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాల వరకు రూట్ బందోబస్తును పరిశీలించారు. సభాస్థలి, సీఎం పర్యటించనున్న ప్రదేశాలు, పైలెట్ వాహనాల ట్రయల్‌రన్ నిర్వహించారు. వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ ఓపెనింగ్ పార్టీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లపై చిరు వ్యాపారులు, వాహనాలు నిలుపరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ సభకు వచ్చే వాహనాలకు ఆర్టీసీ బస్‌డిపోలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని.. కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని సూచించారు. బందోబస్తును మొత్తం ఏడు సెక్టార్లుగా విభజించామని.. నలుగురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 28 మంది ఎస్‌ఐలు, 140 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 420 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్, 250 మంది హోంగార్డులు విధులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట సీఐ కృష్ణ, ఇతర పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.
రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
‘రేవంతన్న కా భరోసా’ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

నేడు జిల్లాకు సీఎం రాక
Comments
Please login to add a commentAdd a comment