
నాణ్యమైన భోజనం అందించాలి
కొత్తకోట రూరల్: వసతిగృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కమిషనర్ క్షితిజ ఆదేశించారు. ఆదివారం కొత్తకోట పట్టణంలోని ఎస్సీ బాలుర, బాలికల వసతిగృహాలతో పాటు కానాయపల్లి శివారులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో స్టోర్ రూంలతో పాటు డార్మెంటరీ హాల్స్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. హాస్టల్‌లో భోజనం మంచిగా ఉంటుందా? కూరగాయలు రుచికరంగా ఉన్నాయా లేదా? అని తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. వసతిగృహాల్లో ఉంటూ చదువుతున్న ప్రతి విద్యార్థి 10/10 జీపీఏ సాధించాలని సూచించారు. వార్షిక పరీక్షలను భయంతో కాకుండా ఇష్టంతో రాస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులందరూ భవిష్యత్‌లో ఉన్నతంగా జీవించాలని ఆకాంక్షించారు. కమిషనర్ వెంట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఎం.మల్లికార్జున్, డివిజనల్ ఆఫీసర్ జె.మల్లేశం, వసతిగృహ సంక్షేమ అధికారులు బెనర్జీ, సంతోష్ కుమార్, జ్యోతి, గోపాల్ నాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment