
పంటలకు సాగునీరు అందిస్తాం
వనపర్తి: జిల్లాలో యాసంగి పంటలకు సకాలంలో తడి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యాసంగి పంటలు, ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూ అమలు తదితర అంశాలపై కలెక్టర్, ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది యాసంగిలో దాదాపు 90వేల ఎకరాల్లో వరిసాగు చేయగా.. ఈసారి 52 శాతం అధికంగా 1.41 లక్షల ఎకరాల్లో సాగుచేయడం జరిగిందన్నారు. ఏదుల, పెబ్బేరు మండలాలకు కొంత సాగునీటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని.. జూరాల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీరు వదిలితే సమస్య తీరుతుందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. వీసీలో డీఏఓ గోవింద్ నాయక్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రాజశేఖర్, ఇరిగేషన్ ఎస్‌ఈ సత్యనారాయణ ఉన్నారు.
నిబంధనల మేరకే అనుమతులు..
ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లాలో కొత్తగా ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, డెంటల్ ఆస్పత్రుల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పరిశీలించింది. దరఖాస్తులో పొందుపరిచిన విషయాలు, ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలు, డాక్టర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లినికల్ యాక్ట్ ప్రకారం ఉన్న వాటికి అనుమతులు మంజూరు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి..
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేటి ప్రజావాణిలో 22 అర్జీలు వచ్చాయని.. వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు.
గతేడాది కంటే ఈసారి 52 శాతం అధికంగా సాగు
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment