
మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధికి హామీ
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం సుమారు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని.. మరో రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తిలో విద్య అభ్యసించిన అభిమానంతో ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారన్నారు. అతి తక్కువ కాలంలో సీఎం సభ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం.. విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల విషయమై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన ఆరోపణలు సత్యదూరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ నిర్మాణాలకు మాత్రమే జీఓలు ఇచ్చారని.. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసింది 500 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి మాత్రమేనన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అదే విధంగా గతంలో కేటీఆర్ ఐటీ టవర్, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వ జీఓలు లేకుండానే శంకుస్థాపన చేశారని.. ఈ విషయమై పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దివంగత మాజీ ఎమ్మెల్యేలు జయరాములు, బాలకిష్ట్ణయ్య పేర్లతో గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రికి నామకరణం చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చందర్, నాయకులు కిచ్చారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment