ఎల్‌ఆర్‌ఎస్ లేకుంటే ఇబ్బందులే
వనపర్తిటౌన్: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25 శాతం రాయితీతో నెలాఖరు వరకు అవకాశం ఇచ్చిందని.. సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయ సమావేశ మందిరంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్ లేకుండా ప్లాట్లు కొనుగోలు చేస్తే మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇళ్లు నిర్మించుకునే సమయంలో మార్కెట్ విలువపై 14 శాతం జరిమానా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 29 వేల మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని.. క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కేవలం 38 మంది మాత్రమే డబ్బులు చెల్లించినట్లు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలోని 5 పురపాలికల్లో సుమారు 25 వేల మందికి నోటీసులు జారీ చేసినప్పటికీ ఫోన్‌నంబర్లు, చిరునామాల్లో తేడాలు ఉండటంతో వారికి సమాచారం చేరడం లేదన్నారు. ఏదైనా కారణంతో ఎల్‌ఆర్‌ఎస్ తిరస్కరిస్తే చెల్లించిన డబ్బు నుంచి 10 శాతం ప్రాసెసింగ్ ఫీజు మినహాయించుకొని మిగిలిన 90 శాతం తిరిగి యజమాని ఖాతాలో జమ చేస్తామని వివరించారు. ఓ రియల్ వ్యాపారి చిట్యాల సమీపంలో నాలా కన్వర్షన్ చేసి వెంచర్ వేశామని చెప్పగా ఆ వెంచర్‌ను వెంటనే రద్దు చేయాలని పుర కమిషనర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, అన్ని పురపాలికల కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు, బిల్డర్లు, టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లు, రియల్ పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్‌సురభి
Comments
Please login to add a commentAdd a comment