జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నెలాఖరు వరకు జిల్లావ్యాప్తంగా 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ప్రజలు గుమిగూడేలా కార్యక్రమాలు నిర్వహించొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు చేపడితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు, కులమతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిచేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
ఇంటర్ పరీక్షలకు
కట్టుదిట్టమైన భద్రత..
బుధవారం నుంచి జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పరీక్ష కేంద్రాల ఆవరణలో 163 బీఎన్‌ఎస్‌ఎస్– 2023 (144) సీఆర్‌పీసీ చట్టం అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరిగే సమయాల్లో కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని, 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని తెలిపారు. పరీక్ష సమయంలో పోలీస్ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి మానసిక ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment