మహిళా సాధికారతతోనే సమగ్రాభివృద్ధి
వనపర్తి విద్యావిభాగం: మహిళా సాధికారతతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎస్‌వీఎంఆర్ డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను వినియోగించుకొని మహిళలు అన్నిరంగాల్లో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు. బాల్యవివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలు, మహిళలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయసేవలు అందిస్తుందన్నారు. బాల్యవివాహాలు, పోక్సో, బాల కార్మిక, మోటారు వెహికల్ చట్టం గురించి వివరించారు. ఉచిత న్యాయ సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది చాంద్‌పాషా, కల్పన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment