
అడ్డగోలు చెల్లింపులు!?
అధికారిక బ్యాంకు ఖాతా నుంచి ఇష్టానుసారంగా డబ్బులుడ్రా
●
వాహనాల అద్దె చెల్లింపులపై
అనుమానాలు..
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్న వాహనాల అద్దె చెల్లింపుల్లోనూ భారీఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్లు వదంతులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు పసుపురంగు నంబర్‌ప్లేట్ ఉన్న వాహనాలను మాత్రమే అద్దెకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ చాలా శాఖల్లోని అధికారులు మాత్రం తెలుపురంగు నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలనే అద్దెకు తీసుకొని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న అంశంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
ప్రభుత్వానికి నివేదిస్తాం..
వచ్చిన ఫిర్యాదుల మేరకు బీసీ అభివృద్ధిశాఖ అధికారిక ఖాతా నుంచి నగదు ఉపసంహరణలపై సమగ్ర విచారణ చేపట్టాం. కార్యాలయ సిబ్బంది పేర్లతో రాసిన చెక్కుల విషయమై వారితో సే్‌ట్‌ట్‌మెంట్ రికార్డ్ చేశాం. ఇప్పటికే సదరు అధికారికి షోకాజ్ నోటీసు కూడా జారీ చేశాం. సమగ్ర విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం. గతంలో వైద్య, ఆరోగ్యశాఖలో చోటు చేసుకున్న ఘటన విషయం నాకు తెలియదు. – జి వెంకటేశ్వర్లు
అదనపు కలెక్టర్ (రెవెన్యూ), వనపర్తి
వనపర్తి: అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి ఇష్టానుసారంగా నగదు డ్రా చేస్తున్న ఘటనలు రోజుకో ప్రభుత్వ శాఖలో వెలుగుచూస్తున్నాయి. గతంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో అటెండర్లు, కార్యాలయ సిబ్బంది పేర్లతో నగదు విత్‌డ్రా చేసిన ఘటనలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా అప్పటి కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ విచారణకు ఆదేశించారు. ఇటీవల నారాయణపేట జిల్లాకు బదిలీ అయిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను విచారణ అధికారిగా నియమించి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. విచారణ ప్రారంభించి ఏడాదికావస్తున్నా... నేటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం. తాజాగా కలెక్టరేట్‌లోని బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. విద్యార్థి సంఘాలు, బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు ఆ శాఖలో అక్రమాలు జరిగాయంటూ జిల్లా నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేశారు. రాజకీయ జోక్యం ఉండటంతో జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల అభ్యున్నతికి వెచ్చించాల్సిన నిధులను అధికారిక చెక్కులపై కార్యాలయ సిబ్బంది పేర్లతో అడ్డగోలుగా డ్రా చేసుకొని వినియోగించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీసీ అభివృద్ధిశాఖలో చోటు చేసుకున్న ఘటనపై రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు విచారణ జరిపి వచ్చిన ఆరోపణలపై సంజయిషీ కోరుతూ సదరు అధికారికి నోటీసు ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా ప్రభుత్వ శాఖల ఖాతాల నుంచి సదరు శాఖలో పనిచేసే సిబ్బంది పేర్లతో నిధులు డ్రా చేయడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని మరికొన్ని ప్రభుత్వ శాఖల్లోనూ చోటు చేసుకున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. మరిన్ని శాఖల్లో జరిగిన అవినీతిని అతి త్వరలోనే బయట పెడతామని.. నిధుల గోల్‌మాల్‌కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామంటూ వివిధ ప్రజా, విద్యార్థి సంఘాలు మీడియా, సోషల్ మీడియా వేధికలుగా హెచ్చరికలు చేస్తున్నాయి.
మొన్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో..
నిన్న బీసీ అభివృద్ధిశాఖలో...
విచారణ పేరుతో కాలయాపన
రికవరీపై సన్నగిల్లుతున్న ఆశలు

అడ్డగోలు చెల్లింపులు!?
Comments
Please login to add a commentAdd a comment