
సామాజిక మాధ్యమాల ప్రభావం
70 శాతం ఫిర్యాదులు సోషల్ మీడియా పరిచయాలతోనే..
వనపర్తి: దేశం శాస్త్ర, సాంకేతికరంగంలో ఎంత పురోగతి సాధించినా.. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా.. ఏటా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఇన్‌స్టా, నోచాట్ లాంటి సామాజిక మాధ్యమాల యాప్‌లలో పరిచయాలు పెంచుకొని మొదట స్నేహం, తర్వాత ప్రేమ పేరుతో దగ్గరై తర్వాత దాడులకు పాల్పడుతున్నట్లు భరోసా కేంద్రంలోని అధికారులు, సభ్యులు వెల్లడిస్తున్నారు. కేంద్రానికి వచ్చిన ఫిర్యాదుల్లో 70 శాతానికిపైగా అలాంటివే ఉండటం శోచనీయం. మహిళలపై దాడులకు సోషల్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తుందని షీటీమ్స్, భరోసా, సఖి కేంద్రాలకు అందుతున్న ఫిర్యాదులతో స్పష్టమవుతోంది.
మైనర్లే అధికం..
జిల్లాలో భరోసా కేంద్రం ఏర్పాటై సుమారు ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు 51 కేసులు నమోదు కాగా.. అందులో 50 కేసులు పోక్సో చట్టం ప్రకారం నమోదు చేసినట్లు కేంద్రం పర్యవేక్షకుడు, ఎస్‌ఐ ఎండీ అంజాద్ వెల్లడించారు. జిల్లాలోని విద్యాసంస్థలు, ఇతర ప్రదేశాల్లో కేంద్రం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 59 అవగాహన సదస్సులు నిర్వహించారు. నేటి వరకు భరోసా కేంద్రానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే సామాజిక మాధ్యమాల్లో పరిచయమై మోసం చేశారన్న ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. కేంద్రానికి వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికం మైనర్ల నుంచే రావడం శోచనీయం.
గతేడాది 147 కేసులు..
మహిళల భద్రతకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కొనసాగే షీటీం విభాగానికి కొంతకాలంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2024లో 147 ఫిర్యాదులు అందగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 32 ఫిర్యాదులు వచ్చాయి. వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు నుంచే ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. బైక్‌లపై వెంబడిస్తూ వేధిస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. షీటీం బృందాలు వివిధ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. కళాశాలలు, వాణిజ్య సముదాయాలు, బస్టాండ్లలో షీటీం బృందాలు గస్తీ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
మానసిక ధైర్యాన్నిస్తున్నాం..
తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వొదు. సోషల్ మీడియాలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి దురలవాట్లకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆడ పిల్లలకు డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరిన తర్వాతే సెల్‌ఫోన్లు ఇవ్వడం మంచిది. భరోసా కేంద్రానికి వచ్చే ఫిర్యాదుల్లో చాలావరకు పరిష్కరిస్తూ వారికి ఆర్థిక, మానసిక ధైర్యాన్ని అందిస్తున్నాం. – ఎండీ అంజద్,
ఎస్‌ఐ, భరోసా కేంద్రం, వనపర్తి
మహిళలకు ‘భరోసా’..
పోలీస్‌స్టేషన్లు, ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలకు భరోసా కేంద్రాలు అండగా ఉంటున్నాయి. ఫిర్యాదుదారును కేంద్రానికి తీసుకొచ్చి వారికి మానసిక ధైర్యం కల్పించడంతో పాటు కేంద్రంలోని ఏఎన్‌ఎం జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తారు. అనంతరం కేసు నమోదు చేసి వర్చువల్‌గాగాని నేరుగాగాని న్యాయమూర్తిని కల్పించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి వారికి న్యాయం జరిగేలా సలహాలు ఇవ్వడంతో పాటు ఓ కుటుంబంలా తోడుంటుంది.

సామాజిక మాధ్యమాల ప్రభావం
Comments
Please login to add a commentAdd a comment