
జూన్ 1లోగా యూనిఫాంల తయారీ
వనపర్తి విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలను మండలస్థాయిలో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసి జూన్ 1వ తేదీలోగా డీఆర్డీఓ, మెప్మా సహకారంతో కుట్టిస్తామని డీఈఓ అబ్దుల్ ఘనీ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారుల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి యూనిఫాంల పంపిణీపై ప్రత్యేకంగా చర్చించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి కొలతలు తీసుకురావాలని.. 6, 7 తరగతుల విద్యార్థులకు పాంట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఐఆర్సీకి సంబంధించిన అన్ని అంశాలు మండల విద్యాధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో సమ్మిళితవిద్య సమన్వయకర్త యుగంధర్, డీపీఎం అరుణ, మహానంది, శేఖర్, మండల విద్యాశాఖ అధికారులు, ఐఈఆర్పీలు తదితరులు ఉన్నారు.