మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి, సీతక్క
సాక్షిప్రతినిధి, వరంగల్: పార్లమెంట్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ గురి పెట్టింది. శాసనసభ ఎన్నికల్లో వరించిన విజయంతో అధికార పగ్గాలు చేజిక్కించుకున్న ఆ పార్టీ దూకుడుగా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్‌పై వేగంగా పావులు కదుపుతోంది. 12 అసెంబ్లీ స్థానాలకు పదింటిలో గెలిచిన కాంగ్రెస్ వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల ను గెలుచుకోవాలని కుతూహలపడుతోంది. అందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించిన ఆ పార్టీ అధిష్టానం వరంగల్, మహబూబాబాద్‌కు సైతం నియమించింది.
వరంగల్ పార్లమెంట్ స్థానానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్‌కు ఖమ్మం జిల్లాకు చెందిన రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ధనసరి సీతక్కను ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా నియమించింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ లోక్‌సభ స్థానం పరిధి ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాలు, మండలాల నేతలతో సమన్వయం చేయనున్నారు.
పీఏసీలో ఓరుగల్లు ప్రస్తావన..
వరంగల్, మహబూబాబాద్.. పార్లమెంట్ స్థానాలను గెలవడం కాంగ్రెస్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇదే అంశాన్ని సూచించడం గమనార్హం. 12 స్థానాలకు 10 అసెంబ్లీ సీట్లను గెలిచామన్న భావనతో పార్లమెంట్ ఎన్నికలను నిర్లక్ష్యం చేయరాదని ఈ కమిటీలో సూచించినట్లు సమాచారం.
అలాగే కాంగ్రెస్ పార్టీ 131 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 28న నాగ్‌పూర్‌లో జరిగే వేడుకలకు వరంగల్, మహబూబాబాద్ నుంచి పదివేలకు తగ్గకుండా మందిని రైలుమార్గంలో తరలించాలన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలకంటే ముందుగానే అసెంబ్లీ టికెట్లను వదులుకున్న వారిని నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేయాలని, అందుకు సంబంధించిన ఉమ్మడి జిల్లా జాబితా కూడా సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రతీ కార్యకర్త అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన పట్టుదల, తెగువ, కృషి.. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపుగా చూపాలని సూచించింది.
పోటాపోటీగా ఆశావహులు..
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. మాజీ ఎంపీలు, సీనియర్లు, టీపీసీసీ, ఏఐసీసీ నేతలను సంప్రదిస్తున్నారు. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి, కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శనిగపురం ఇందిర పేరు కూడా వినిపిస్తున్నది. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, నెహ్రూనాయక్, బెల్లయ్యనాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నలుగురు సీనియర్లు కూడా వరంగల్, మహబూబాబాద్ కాంగ్రెస్ టికెట్ల కోసం లోపాయికారిగా మాట్లాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో 17 స్థానాల్లో దాదాపు 15–16 స్థానాలు కై వసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వరంగల్, మహబూబాబాద్ ఎంపీలను గెలిపించుకోవడానికి పావులు కదుపుతోంది.
ఇవి కూడా చదవండి: మెదక్‌కు దామోదర.. జహీరాబాద్‌కు సుదర్శన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment