కాళోజీ సెంటర్: మార్చి 5 నుంచి 22 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని, సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 9240205555కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లో ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పాలన్నారు. సమయానికి విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. వైద్య సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 12,321 మంది పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. వీరికి 26పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. ప్రథమ సంవత్సరం, జనరల్ విద్యార్థులు 4,967 మంది, ఒకేషనల్ 848 మందితో కలిపి మొత్తం 5,815 విద్యార్థులు ఉన్నారని వివరించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,739 మంది, ఒకేషనల్ విద్యార్థులు 767 మందితో కలిపి మొత్తం 6,506 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తంగా 12,321 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. వార్షిక పరీక్షల దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో డ్యుయల్ డెస్కులు, నీరు, విద్యుత్, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ మాడభూషి విజయలక్ష్మి, డీఆర్‌డీఓ అధికారి కౌసల్య దేవి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావుతో పాటు ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, పోస్టల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
Comments
Please login to add a commentAdd a comment