పాకాలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
ఖానాపురం: అటవీ ప్రాంతాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. దీంతో ఉన్నతాధికారుల సూచనలతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను పాకాల అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి ఎఫ్‌ఆర్వో రవికిరణ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అవగాహన కల్పించారు. రాయపర్తి, పర్వతగిరి, వంచనగిరి, కాశిబుగ్గతోపాటు పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాకాలను సందర్శించారు. విద్యార్థులు చదవడం కంటే చూడడం ద్వారా విద్యార్థుల్లో ఎక్కువ విజ్ఞానం లభిస్తుందనే ఆలోచనతో ఫీల్డ్‌ట్రిప్ చేపట్టారు. పాకాల అటవీ ప్రాంతంలో పలు అంశాలను తెలుసుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు వెల్లడించారు.
ప్రత్యేక బస్సుల్లో పాకాలకు..
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2,756 మంది విద్యార్థులు పాకాలకు హాజరయ్యారు. ఈనెల 13న 256 మంది, 18న 1200 మంది, 19న 1300 మంది విద్యార్థులు ప్రత్యేక బస్సుల్లో పాకాలకు వచ్చారు. అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం, అడవిలో నడక, బటర్ ఫ్లై అటవీ జంతువులపై అవగాహన, మొక్కలు నాటడం, నర్సరీ ఏర్పాటు, సరస్సులు, జీవవైవిధ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విషరహిత, విషంతో కూడిన సర్పాల గురించి విద్యార్థులకు వివరించారు. ఫీల్డ్‌ట్రిప్‌ల ద్వారా విద్యార్థులకు మానసిక ప్రశాతంతతోపాటు విజ్ఞానం లభించడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
‘పీఎంశ్రీ’తో మూడు రోజుల్లో
2,756 మంది సందర్శన
అడవులు, మొక్కల పెంపకం,
జీవవైవిధ్యంపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment