చదువుతోనే సమాజంలో గుర్తింపు
వరంగల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, విద్యార్థినులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే అశించిన ఫలితాలు వస్తాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. హనుమకొండ రాంనగర్‌లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంటగది, పరిసరాలను పరిశీలించారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం, వార్డెన్ 24 గంటలు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీఎస్సీడీఓను ఆదేశించారు. వంటమనిషి ఆరు గంటలకే రాత్రి భోజనం వండుతుందని విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. కుక్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతిగృహాన్ని రాంనగర్ నుంచి వరంగల్‌కు మార్చాలని విద్యార్థులు కలెక్టర్‌ను కోరగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఈఓను ప్రత్యేక అధికారిగా నియమించి హాస్టల్‌లో విద్యార్థి నులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు. పరీక్ష ప్యాడ్లు అందజేసి, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. తనిఖీల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వసుమతి, హాస్టల్ వార్డెన్ హరిత తదితరులు పాల్గొన్నారు.
బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవాలి
ఖిలా వరంగల్: విద్యార్థులు బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి పదో తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ జవాబులు రాబట్టి పాఠ్యాంశాలను బోధించారు. విద్యార్థులకు అందించే స్నాక్స్‌ను పరిశీలించి మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచే లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలను సాధిస్తారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment